ఇంటర్ విద్యార్ధుల ఆన్‌లైన్ క్లాసులపై సర్కార్ కీలక ప్రకటన.!

by Shyam |
ఇంటర్ విద్యార్ధుల ఆన్‌లైన్ క్లాసులపై సర్కార్ కీలక ప్రకటన.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూనియర్ కళాశాలలో ఈ నెలాఖరు వరకే ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించనున్నారు. ఉదయం సెకండ్ ఇయర్, మధ్యాహ్నం ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. 31 తరువాత ఏ విధంగా తరగతులను నిర్వహిస్తారనే అంశాలను ఇంటర్ బోర్డ్ ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఫిజికల్ క్లాసుల నిర్వహణపై ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఈ నెల 30 వరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల అడ్మిషన్‌కు అవకాశం కల్పించారు.

జూనియర్ కళాశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులు ఈ నెల 31 వరకే కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులను ప్రారంభించిన ఇంటర్ బోర్డ్ తాజాగా సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 31 వరకు తరగతుల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది.

ఇంటర్ తరగతుల షెడ్యూల్.

దూరదర్శన్, టీ-సాట్ ద్వారా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 2 ఏ,బి, బాటనీ, జూవాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ తరగతులను, శుక్రవారం ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్ తరగతులను, శనివారం ఉర్దూ మీడియం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 2 ఏ,బి, బాటనీ, జూవాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ తరగతులను నిర్వహిస్తున్నారు.
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 1 ఏ, 1బి, బాటనీ, జూవాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ తరగతులను, శుక్రవారం యోగా, మెడిటేషన్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్ తరగతులను, శనివారం ఉర్దూ మీడియం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 1 ఏ, 1బి, బాటనీ, జూవాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ తరగతులను నిర్వహిస్తున్నారు.
ఫిజికల్ క్లాసులపై ఇంకా తేలని క్లారిటీ..
ఇంటర్ బోర్డ్ ఫిజికల్ క్లాసులపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నెల 31 తరువాత ఏ పద్దతుల్లో తరగతులను నిర్వహిస్తారనే అంశాలను ప్రస్థావించడం లేదు. అకాడమిక్ ఇయర్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నప్పటికీ తరగతుల నిర్వహణపై స్పష్టమైన వైఖరిని తెలుపులేకపోతున్నారు. కరోనా ప్రభావం ఏవిధంగా ఉంటుందనే అంశాలను అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.

ఆన్ లైన్ తరగతులతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల అడ్మిషన్ గడువును ఈ నెల 30 వరకు పొడగిస్తూ ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. రెండు సంవత్సరాల ఇంటర్ కోర్సులను అందిస్తున్న అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed