టాస్క్‌లు పూర్తి చేయండి.. డబ్బులు సంపాదించండి!

by Shyam |
టాస్క్‌లు పూర్తి చేయండి.. డబ్బులు సంపాదించండి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఫోన్’ పట్టుకున్నామంటే చాలు.. ఆ ఫోన్ ఏమైనా తిండి పెడుతుందా? ఏదైనా పనికి వచ్చే పని చేయొచ్చు కదా? డబ్బులు సంపాదించే ఉద్దేశమే లేదా? అంటూ ఇంట్లో చెల్లి నుంచి తాతయ్య వరకు అందరూ తిడుతుంటారు. అయితే ఇకపై వాటన్నింటికీ మొబైల్ అడిక్టర్స్ సమాధానం చెప్పే అవకాశం రాబోతుంది. బిగ్‌బాస్ టాస్క్‌లు చూస్తే మనకు వచ్చేది ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే, ఒక్క రూపాయి కూడా జేబులోకి రాదు. అదే ‘గూగుల్ టాస్క్‌మేట్’‌లో టాస్క్‌లు పూర్తి చేస్తే.. ఇటు టైమ్‌పాస్, అటు మనీ ఎర్నింగ్ అన్నమాట! ఇంతకీ ‘గూగుల్ టాస్క్‌మేట్’ అంటే ఏంటి?

టెక్ దిగ్గజం గూగుల్.. ఇండియాలో గూగుల్ టాస్క్‌మేట్ అనే యాప్‌‌కు టెస్ట్ రన్ చేస్తోంది. ఇందులో చాలా సులభమైన భిన్నరకాల టాస్క్‌లు ఉంటాయి. ఉదాహరణకు.. ఫొటోలు క్లిక్ చేయడం, సర్వేలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ట్రాన్స్‌లేషన్ (ఒక భాష నుంచి మరో భాషలోకి అనువదించడం) చేయడం. ప్రపంచంలో వేర్వేరు వ్యాపార సంస్థలు పోస్ట్ చేసే టాస్క్‌లలో మనకు ఇష్టమున్నవి ఎంచుకోవచ్చు. ఆ చిన్న చిన్న టాస్క్‌లు కంప్లీట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. టాస్క్ కంప్లీట్ చేయగానే స్థానిక కరెన్సీలోనే డబ్బులు మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ప్రస్తుతం బీటావెర్షన్‌లో ఉన్న ఈ యాప్‌ను గూగుల్ అధికారికంగా ఎప్పుడు లాంచ్ చేస్తుందో స్పష్టతనివ్వలేదు. ఇందులో ఇంట్లో కూర్చుని పూర్తి చేసే టాస్క్‌లతో పాటు ఫీల్డ్ టాస్క్‌లు కూడా ఉంటాయి. ఎన్ని టాస్క్‌లు పూర్తి చేశాం, ఎంతవరకు కరెక్ట్‌గా చేశాం, లెవల్ ఏంటి? తదితర అంశాలతో పాటు ఎన్ని టాస్క్‌లు రివ్యూలో ఉన్నాయో ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఒక్కో టాస్క్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో కూడా ముందుగానే తెలుసుకోవచ్చు.

Advertisement

Next Story