డుయోకు గుడ్‌బై చెప్పబోతున్న గూగుల్?

by  |
డుయోకు గుడ్‌బై చెప్పబోతున్న గూగుల్?
X

కొత్త ప్రొడక్ట్ రాగానే పాత ప్రొడక్ట్‌కు గుడ్‌బై చెప్పేసి, దాన్ని కొత్త ప్రొడక్ట్‌లో కలిపేయడం గూగుల్‌కు బాగా అలవాటైంది. మొన్నటికి మొన్న గూగుల్ ప్లే (Google play) మ్యూజిక్ యాప్‌ను యూట్యూబ్ మ్యూజిక్‌లో కలిపేసే ప్రయత్నం చేస్తోందని తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా వారి పాపులర్ వీడియో కాలింగ్ యాప్ డుయో(Duo)కు కూడా స్వస్తిపలికేసి దాన్ని కొత్తగా వచ్చిన గూగుల్ మీట్‌లో కలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూమ్ యాప్‌(Zoom App)కు పోటీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాలను తీర్చడానికి తీసుకొచ్చిన గూగుల్ మీట్‌లో దాదాపు డుయోలో ఉన్న ఫీచర్లే ఉన్నాయి. ఒకే రకమైన సదుపాయాలతో రెండు వేర్వేరు యాప్‌లు ఎందుకని, ఆ రెండింటినీ కలిపేందుకు గూగుల్ యోచిస్తోందని 9టు5గూగుల్ వెబ్‌సైట్ పేర్కొంది.

జీ సూట్ హెడ్‌గా జేవియర్ సోల్టేరో నియామకమైన తర్వాత మెసేజెస్, డుయో, ఆండ్రాయిడ్ ఫోన్ యాప్ ఇలా అన్నింటిని ఒకే తాటి మీదకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా మీట్‌ను అందరికీ ఉచితంగా అందజేస్తూ, అటు అధికారిక మీటింగులను, ఇటు వ్యక్తిగత వీడియో కాల్స్‌ను నిర్వహించగల యాప్‌గా మార్చి, డుయోను తీసేస్తే సరిపోతుందని జేవియర్ ఆలోచన చేశారు. ఇందులో భాగంగా డుయోలో ఉన్న ఫీచర్లన్నీ మీట్‌కు బదిలీ చేసి, డుయోకు ఉన్న కస్టమర్ సర్వీస్‌ టీమ్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. 2016లో డుయో, అల్లో యాప్‌లను గూగుల్ విడుదల చేసింది. అయితే అల్లో యాప్ అట్టర్ ఫ్లాప్ అవగా, డుయో యాప్ బాగా పాపులర్ అయింది. ఇది అందించే హెచ్‌డీ క్వాలిటీ వీడియో కాలింగ్ సదుపాయం దీన్ని వీడియో కాలింగ్ యాప్స్‌లో ప్రత్యేకమైనదిగా నిలిపింది.


Next Story