మార్కెట్‌లోకి.. సెల్ఫ్ శానిటైజింగ్ టాయిలెట్ బ్రష్

by  |
మార్కెట్‌లోకి.. సెల్ఫ్ శానిటైజింగ్ టాయిలెట్ బ్రష్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో ప్రజలంతా దేన్నయినా ముట్టుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఏ వస్తువును తాకినా లేదా కాస్త అనుమానమొచ్చినా చాలు.. చేతి రేఖలు అరిగిపోయేదాకా కడుగుతున్నారు. వ్యక్తిగత శుభ్రత వరకైతే బాగానే ఆలోచిస్తున్నాం. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో టాయిలెట్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే బాత్రూమ్‌ను కూడా బ్లీచింగ్ పౌడర్లతో, ఇతర క్లీనింగ్ ప్రొడక్ట్స్‌తో చాలామంది నీట్‌గా కడుగుతున్నారు. సాధారణంగా టాయిలెట్‌ను క్లీన్ చేసేందుకు బ్రష్‌ను వాడుతుంటాం. కానీ, ఈ బ్రష్ వాడేందుకు కూడా భయపడి, దానిపైనా బ్లీచ్ వేసి కడిగేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదంటోంది ‘గుడ్ పాప’ అనే కంపెనీ. ఇలాంటి భయాలేవీ లేకుండా ప్రపంచంలోనే తొలిసారిగా ‘సెల్ఫ్ శానిటైజింగ్ టాయిలెట్ బ్రష్‌’ను అందించనుంది.

గుడ్ పాప అందిస్తున్న బ్రష్‌లో యూవీ (అల్ట్రా వయోలెట్) లైట్ ఉంటుంది. టాయిలెట్‌ను క్లీన్ చేసిన తర్వాత బ్రష్ దానికి కేటాయించిన కంటైనర్‌లోకి వెళ్తుంది. అందులోకి వెళ్లగానే.. యూవీ లైట్ ఆ బ్రష్‌లోకి చేరిన బ్యాక్టీరియాలను, వైరస్‌లను చంపేస్తుంది. కేవలం 120 సెకండ్లలో 99.99% ఆ బ్రష్‌కున్న టోటల్ బ్యాక్టీరియాను చంపుతుందని కంపెనీ తెలిపింది. ఈ బ్రష్‌ను ఉపయోగించి ఈజీగా టాయిలెట్‌‌ను శుభ్రం చేయొచ్చని, ఎక్కువగా మరకలు ఉన్న చోట.. బలం పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా బ్రష్‌ను నొక్కి ఉంచితే చాలు.. అదే క్లీన్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ యూవీ లైట్ బ్రష్‌ను ఒక్క సారి చార్జ్ చేస్తే 3 నెలల పాటు వస్తుంది. కాగా, ఈ గుడ్ పాప టాయిలెట్ బ్రష్.. కిక్ స్టారర్‌లో అందుబాటులో ఉంది.


Next Story