గుడ్ బై.. టిక్ టాక్!

లాక్‌డౌన్ సమయంలో మీరెలా టైమ్‌పాస్ చేశారని ఎవరినైనా అడిగితే.. కాస్త డబ్బున్నవాళ్లయితే ‘అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌’లో సినిమాలు చూశామని చెప్పారు. కానీ ఎక్కువ మంది చెప్పిన సమాధానం మాత్రం.. ‘టిక్ టాక్’ చూస్తూ టైమ్‌పాస్ చేశామని. అలాంటి టిక్ టాక్ యాప్‌ ఇప్పుడు భారతదేశంలో నిషేధానికి గురైంది. అవును.. టిక్‌టాక్ యాప్ కారణంగా దేశ రక్షణకు భంగం కలిగే అవకాశాలున్న మాట నిజమే అయ్యుండొచ్చు. అయితే ఎలాగూ నిషేధానికి గురైన ఆ యాప్‌కి సంబంధించి చరిత్ర, ఇతర విషయాల గురించి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా గుర్తు చేసుకోవడం ద్వారా మళ్లీ మన దేశానికి తిరిగొస్తుందో రాదో తెలియని టిక్‌టాక్ యాప్‌కి సరైన విధానంలో నివాళి తెలియజేసిన వాళ్లమవుతాం..

పుట్టిందిలా..

చైనాలోని బీజింగ్‌కు చెందిన బైట్‌డ్యాన్స్ సంస్థ.. ఈ టిక్ టాక్ యాప్‌ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీని జాంగ్ యిమింగ్ 2012లో స్థాపించారు. 2016 సెప్టెంబర్‌లో డుయిన్ పేరుతో ఒక యాప్‌ను ఈ సంస్థ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. 2017లో టిక్ టాక్ పేరుతో ఇతర దేశాల్లో ఆవిష్కరించారు. తర్వాత 2018 ఆగస్టులో మ్యూజికల్లీ యాప్‌తో ఇది కలిసిపోయిన తర్వాత మంచి ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. 3 నుంచి 15 సెకన్ల మధ్య వీడియోను, షార్ట్ మ్యూజిక్, లిప్ సింక్ వీడియోలను ఇందులో చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా లాస్ ఏంజెలీస్, న్యూయార్క్, లండన్, పారిస్, బెర్లిన్, దుబాయ్, ముంబై, సింగపూర్, జకార్తా, సియోల్, టోక్యోల్లో దీని కార్యాలయాలు ఉన్నాయి. తూర్పు ఆసియా, దక్షిణాసియా, అమెరికా, టర్కీ, రష్యాల్లో ఈ యాప్ చాలా ఫేమస్. దాదాపు 150 మార్కెట్లలో 75 భాషల్లో అందుబాటులో ఉన్న టిక్ టాక్ యాప్.. ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకున్న మొట్టమొదటి చైనా యాప్‌గా నిలిచింది. జూన్ 2020 నుంచి కెవిన్ మేయర్ టిక్ టాక్ సీఈవోగా పనిచేస్తున్నారు.

ఎందుకు ఫేమస్?

ఒక వ్యక్తిలో ఉన్న కళ ప్రపంచానికి తెలియాలంటే ఒక మాధ్యమం అవసరం. ఇంటర్నెట్ వారధిగా అలాంటి మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిల్లో వీడియోలు అన్ని రకాల హంగులతో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి, వివిధ ఎఫెక్టులు ఉపయోగించి తెరకెక్కించినవి అయ్యుంటాయి. కానీ ఒక పేదవాడు, ఎలాంటి సదుపాయాలు లేని వ్యక్తి అంత ఖర్చు చేసి వీడియోలు తీయలేడు. ఇలాంటి వాళ్లు టిక్‌టాక్ వారధిగా తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు.

ప్రతి ఒక్కరి టిక్‌టాక్ వారికి అనుగుణంగా ఉండే వీడియోలనే, వారి కోసం ప్రత్యేకంగా వ్యక్తిగతీకరించినవే చూపిస్తుంది. అందుకు టిక్‌టాక్ ఉపయోగిస్తున్న రికమండేషన్ అల్గారిథంను మెచ్చుకుని తీరాలి. లిప్ సింక్ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందడంతో నటన మీద ఆసక్తి ఉన్న ఎంతో మంది ఈ యాప్ ద్వారా లాభపడ్డారు. కొందరు ఏకంగా టిక్ టాక్ స్టార్లుగా ఎదిగి బ్రాండింగ్ సంపాదించుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వీడియోలు చేయడం ద్వారానే సాధ్యమైంది.

ట్రెండ్ సెట్టర్

‘చూసేవాళ్లు ఉన్నంత కాలం చేసేవాళ్లకు కొదవలేదు’ అన్నట్లుగా రోజూ ఏదో ఒక కొత్త వీడియో టిక్‌టాక్‌లో ట్రెండ్ అయ్యేది. దాన్ని ఫాలో అవుతూ వేల మంది మళ్లీ వీడియోలు చేసేవారు. ఒకటే ట్రెండ్‌కు తమ సృజనాత్మకతను జోడించి కొత్తగా తీసి లైకులు పొందేవారు. ఒక్కసారి వీడియో ట్రెండ్ అయిందంటే లైకులు వస్తాయి. లైకులు పెరిగితే ఫాలోవర్లు పెరుగుతారు. ఫాలోవర్లు పెరిగితే బ్రాండింగ్ పెరుగుతుంది. ఈ బ్రాండింగ్‌ని ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో ఉపయోగించుకుని వ్యాపార సంస్థలకు పెయిడ్ ప్రమోషన్లు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా తమకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని, బర్త్‌డే విషెస్‌లు, ఇతర సమాచారాన్ని ప్రచారాన్ని బ్రాండింగ్ చేసుకుంటున్నవారూ ఉన్నారు. వీళ్లు ఎంతలా పాపులర్ అంటే, ప్రత్యేకంగా టిక్ టాకర్లు తమ మీటింగుల కోసం హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి.

విమర్శలకు తక్కువేం లేదు

సాధారణంగా పురుష టిక్ టాకర్ల మీద సమాజంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అయినా వాళ్లు ఫేమస్ అవ్వాల్సినచోట ఫేమస్ అయ్యారనుకోండి. ముఖ్యంగా మగవాళ్లు అయ్యుండి ఆడవాళ్లలాగా వస్త్రధారణ చేసుకుని వీడియోలు చేయడాన్ని చాలా మంది తప్పుపట్టారు. వాళ్లను తప్పుడు పేర్లతో సంబోధించారు. అయినప్పటికీ వాళ్లు వీడియోలు చేయడం ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారంటే, వాళ్లకి కళ మీద అపారమైన ప్రేమ అయినా అయ్యుండాలి లేదా పెద్దమొత్తంలో డబ్బులైనా వస్తుండాలి. డబ్బులు తీసుకుని పెద్ద పెద్ద నటులే చీరలు కట్టుకుని నటిస్తుంటే, మేం చేస్తే ఎందుకు తప్పుపడతారని చాలా మంది టిక్ టాకర్ల అభిప్రాయం. మొత్తంగా ఈ యాప్ ద్వారా ఇలా చిన్న స్థాయి నటీనటులు, కళాకారులు చాలా లాభపడ్డారని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక డ్యాన్సర్లకైతే ఈ టిక్‌టాక్ కొత్త జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. పాత పాటలకే కొత్త స్టెప్పులు జోడిస్తూ చేసే వీడియోలతో పాటు ఏకంగా టిక్‌‌టాక్‌లో డ్యాన్స్ పాఠాలు నేర్పిస్తున్న కొరియోగ్రఫర్లు కూడా ఉన్నారు.

క్రియేటివిటీ ఎట్ పీక్స్

కేవలం కుర్రకారు మాత్రమే కాదు ఈ టిక్ టాక్ యాప్‌లో క్రియేటివిటీని ప్రదర్శిస్తున్న వారిలో పండు ముసలివాళ్లు కూడా ఉన్నారు. టిక్ టాక్ ద్వారా డైలాగులు, డ్యాన్సులు చేస్తూ ఫేమస్ అయిన బామ్మలు, తాతలు చాలా మంది ఉన్నారు. వీళ్లు మాత్రమే కాకుండా గృహిణులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, డ్రైవర్లు, కండక్టర్లు, అంకుల్స్.. ఇలా ప్రతి ఒక్కరూ టిక్ టాక్‌ వీడియోలు చూస్తూ, చేస్తూ మానసిక ఆనందాన్ని పొందారు. ఈ యాప్ ఇంతలా చొచ్చుకుని పోవడానికి కారణం ఏంటంటే.. ఇందులో చదవడాలు ఉండవు, కేవలం చూడడాలు, చేయడాలే!

ఒక యాప్ మనకు ఎంత మంచి చేసినా.. దేశభక్తి విషయానికి వచ్చేసరికి ఇవేవీ పనికిరావు. మన దేశం కోసం సరిహద్దుల్లో చైనా వారి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుని మనల్ని కాపాడుతున్న వారి కోసం మన మానసిక ఆహ్లాదాన్ని త్యాగం చేయగలగడం నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు. కావాలంటే టిక్ టాక్ ప్రత్యామ్నాయంగా భారత దేశంలో తయారైన యాప్‌లను వాడండి. ఈరోజుల్లో ఇంటర్నెట్‌లో ఫేమస్ అవడం చాలా ఈజీ. కానీ దేశం సురక్షితంగా ఉంటే, ఎప్పుడైనా ఫేమస్ కావొచ్చు. అందుకే తమకు దేశభద్రత ముఖ్యం అని టిక్ టాకర్లు అందరూ అనడం నిజంగా గొప్ప విషయమే!

Advertisement