‘కాల్చి పారేయండి..’ ఆమోదమేనా?

by Shamantha N |
‘కాల్చి పారేయండి..’ ఆమోదమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మనిషి తన సున్నితత్వాన్ని కోల్పోవడం ప్రమాదకరమని పెద్దలంటారు. రక్తపాతాన్ని, హింసకు చలించనివారు వాటిని తేలికగా తీసుకునే దశలోకి వెళతారు. తమ రోజువారి జీవితంలో ‘హింస’ సామాన్య విషయంగా మారినప్పుడు సమాజం ప్రమాదపుటంచులకు చేరుతున్నట్టేనని ఓ సామాజికవేత్త వ్యాఖ్యానించారు. ఇప్పుడు మన దేశంలో మూకదాడులు, అత్యాచారాలు, హింస, అల్లర్లు మెల్లమెల్లగా సాధారణాంశాలుగా మారుతున్నాయి. వీటిని పెద్ద నేరంగా పరిగణించి ఆందోళన చెందడమో.. చర్చించడమో లాంటివి పక్కనపెట్టి ఎప్పుడూ ఉండేవేగా అనే ధోరణి పెరుగుతున్నది. ఒక వర్గం మరో వర్గాన్ని దూషించడం, దాడి చేయడం పెద్దగా పట్టించుకోని అంశాలుగా మారాక.. ఆ చర్యలకు ఆమోదమూ పెరుగుతున్నది. అటువంటి దుష్చర్యలను చిత్రించి గొప్పగా సోషల్‌మీడియాలో పోస్టు చేసేవరకు వెళ్లాయి పరిస్థితులు. కానీ, బహిరంగంగా కాల్చిపారేయండి అని హింసకు పిలుపునిచ్చే నినాదాలు సాధారణమవుతుండటం ఇప్పుడు కలవరపెడుతున్నది. కోల్‌కతాలో నిర్వహించిన అమిత్ షా ర్యాలీకి వెళుతున్న కార్యకర్తలు ‘కాల్చిపారేయండి’ అని నినదిస్తూ వెళ్లారు. రోడ్డుపై బహిరంగంగా ఎలాంటి జంకుగొంకు లేకుండా వారు చేస్తున్న నినాదాలకు సంబంధించిన వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఢిల్లీ ఎన్నికల కాలంలో ఈ నినాదం చాలా ప్రచారం పొందింది. చోటామోటా లీడర్లు కాదు.. ఏకంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. దేశద్రోహులను ‘కాల్చి పారేయండి’ అని నినదిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక బహిరంగ సభలో ఇలాంటి నినాదాలు.. అదీ ఒక కేంద్రమంత్రి ఇవ్వడంపై అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే. తాను అసలు ఆ నినాదమే చేయలేదని, మీడియా పూర్తి సమాచారం తీసుకుని ప్రచురించాలని సదరు మంత్రి ఆదివారం దబాయిస్తూ మాట్లాడారు. మరిన్ని ప్రశ్నలడగ్గా.. అది ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున దానిపై వ్యాఖ్యానించడం సరికాదని విలేకరుల ప్రశ్నలను దాటవేశారు. ఇదే రోజు పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా ప్రసంగించే ర్యాలీకి హాజరయ్యేందుకు కొందరు కార్యకర్తలు.. ‘దేశ్‌కే గద్దారోంకో.. గోలీ మారో సాలోంకో’(దేశద్రోహులను.. కాల్చి పారేయండి) అని అలవోకగా నినాదాలు చేస్తూ నడుచుకుంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి రెచ్చగొట్టే నినాదాలకు మెల్లమెల్లగా ఆమోదం లభిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటువంటి ఆమోదమే విపత్కరపరిణామాలకు దారితీస్తుంది. అల్లర్లకు భారీమొత్తంలో గుమిగూడటం.. మూకుమ్మడిగా దాడులకు తెగబడటం.. మూకలోని వారందరూ తాము చేస్తున్నది సరైనదేనని నమ్మేందుకు ఈ ఆమోదమే బలాన్నిస్తుంది.

కాల్చి చంపేయండి.. తుపాకీతో కాల్చేయండి లాంటి నినాదాలిచ్చినా.. బీజేపీ నాయకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మాత్రం వెంటనే బదిలీకావడం చర్చనీయాంశమైంది. ఈ నినాదాల తర్వాతే ఢిల్లీలో తుపాకులు పట్టుకుని జామియా మిలియా ఇస్లామియా, షహీన్‌బాగ్ ఏరియాల్లో యువకులు వీరంగం సృష్టించిన విషయం విదితమే. 20 ఏళ్లు నిండనివారూ తుపాకీ పట్టుకునే దుస్థితికి చేరుతున్నామని మానవతావాదులు వాపోతున్నారు. ఢిల్లీలోని మౌజ్‌పుర్ ఏరియాలోని ఓ మెట్రో పిల్లర్‌పై ‘గాడ్సేను అనుసరించే దమ్ములేనోడే గాంధీ అవుతాడ’నే రాతలు ఏం వివరిస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి రెచ్చగొట్టే లేదా హింసాత్మక వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లు జరిగాయన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గోలి మారో సాలోంకో.. లాంటి నినాదాలతో అమాయకుల మనసుల్లో విద్వేషం రగిలి రగిలి ఏ క్షణాల్లో ఉపద్రవంగా పరిణమించి బద్దలవుతుందో ఎవరికి తెలుసు? అందుకే రెచ్చగొట్టే, విద్వేష ప్రసంగాలు, నినాదాలు ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed