23 శాతం పెరిగిన బంగారం దిగుమతులు

by Harish |
23 శాతం పెరిగిన బంగారం దిగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం చూపే బంగారం దిగుమతులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 22.58 శాతం పెరిగి సుమారు రూ. 2.57 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయంగా పసిడికి డిమాండ్ పెరగడం వల్లే దిగుమతుల వృద్ధికి కారణమని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు రూ. 2.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. అదేవిధంగా, గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 71 శాతం క్షీణించాయి. దీంతో 2020-21లో రూ. 5,900 కోట్ల విలువైన వెండి దిగుమతులు నమోదయ్యాయి.

బంగారం దిగుమతుల్లో వృద్ధి గణనీయంగా నమోదైనప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ వాణిజ్య లోటు రూ. 7.34 లక్షల కోట్లకు తగ్గడం విశేషం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు రూ. 12 లక్షల కోట్లుగా ఉంది. దేశీయంగా డిమాండ్ పెరగడం వల్లే పసిడి దిగుమతిని పెంచుతోందని జెం అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) ఛైర్మన్ కొలిన్ షా చెప్పారు. రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ దిగుమతులు మరింత పెరుగుతాయని, దీనివల్ల కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారత్. ప్రధానంగా ఆభరణాల పరిశ్రం నుంచి ఈ డిమాండ్ ఉంటుంది. 2020-21లో ఆభరణాల ఎగుమతులు 27.5 శాతం తగ్గి రూ. 1.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రతి ఏటా భారత్ 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బంగారం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed