కీలక మ్యాచ్‌లో గోవా విజయం

by Shyam |
ISL
X

దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌ పాయింట్ల పట్టిక టాప్-4లో కొనసాగాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ రాణించింది. ఆదివారం సాయంత్రం ఫటోర్డా స్టేడియంలో బెంగళూరు ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. టాస్ గెల్చిన గోవా జట్టు కుడి నుంచి ఎడమకు కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. 20వ నిమిషంలో గ్లన్ మార్టిన్స్ ఇచ్చిన పాస్‌ను ఇగొర్ అంగులో గోల్‌గా మలిచి గోవాకు 1-0 ఆధిక్యాన్ని తీసుకొచ్చాడు. 23వ నిమిషంలో గోవా మరో గోల్ చేసింది. అలెగ్జాండర్ జేసురాజ్ ఇచ్చిన పాస్‌ను రిడీమ్ తాంగ్ గోల్‌గా మలిచాడు. 33వ నిమిషంలో క్లిటన్ సిల్వ ఇచ్చిన పాస్‌ను సురేష్ సింగ్ గోల్‌ కొట్టి బెంగళూరుకు తొలి స్కోర్ అందించాడు. రెండో అర్దభాగంలో ఇరు జట్లకు ఒక్కగోల్ కూడా లభించలేదు. దీంతో గోవా ఎఫ్‌సీ 2-1 తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు అలెగ్జాండర్ జేసురాజ్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గ్లన్ మార్టిన్స్‌కు లభించింది.

దివారం రాత్రి కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ, చెన్నయిన్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. టాస్ గెలిచిన కేరళ బ్లాస్టర్స్ ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకుంది. మ్యాచ్ ప్రారంభమైన 10వ నిమిషంలోనే ఎడ్విన్ వన్స్‌పాల్ ఇచ్చిన పాస్‌ను ఫట్కుల్లెవ్ గోల్‌గా మలచడంతో చెన్నయిన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 29వ నిమిషంలో కేరళ ఎఫ్‌సీకి పెనాల్టీ లభించింది. గారీ హోపర్ ఎలాంటి తప్పిదం చేయకుండా పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ చేయలేదు. దీంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు ఎడ్విన్ వన్స్‌పాల్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చాంగ్టేకు లభించింది.

Advertisement

Next Story