గీతం స్మార్ట్ ఐడియాథాన్ – 2021 విజేత ఐఐటి ఖరగ్‌పూర్ జట్టు

by Shyam |
GITAM UNIVERSITY
X

దిశ, పటాన్‌చెరు: యువతలో నూతన ఆలోచనలను ప్రోత్సహించడానికి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా స్టార్టప్ ల ఏర్పాటుకు మార్గదర్శకం చేయడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వెంచర్ డవలప్ మెంట్ సెంటర్ (విడిసి) జాతీయ స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ ఐడియాథాన్-2021 పోటీల ఫైనల్స్ లో ఐఐటి ఖరగ్‌పూర్ జట్టు విజేతగా ప్రథమ స్థానంలో నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతిని, టైటిల్ ను కైవశం చేసుకుంది. దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన 90 కళాశాలల నంచి 250 జట్లు (700 మంది విద్యార్థులు) ఈ పోటీలలో పాల్గొన్నాయని గీతం ఛీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎన్.క్రిష్ తెలిపారు.

ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ఐఐటి ఖరగ్ పూర్ ప్రధమస్థానం సాధించగా జి.హెచ్.రాయసోనీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ద్వితీయ స్థానంలో, గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ తృతీయ స్థానంలో నిలిచాయని ప్రకటించారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన గీతం వి.డి.సి. డైరక్టర్ లెబన్ జాన్సన్ పేరిట నెలకొల్పిన అవార్డు గీతం వైద్య కళాశాల విద్యార్థి బృందంకు లభించిందన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో దేశం లోని ప్రముఖ ఢిల్లీ, భవనేశ్వర్ ఐఐటి జట్లతో పాటు, బెంగళూరు ఐఐఎమ్, ఢిల్లీ ఐ.ఐ.ఎఫ్.టి జట్టు, పూనే ఎస్ఐబిఎమ్, చెన్నై వి.ఐ.టి. జట్టు టైటిల్ కోసం తల పడ్డాయన్నారు.

ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మనూష్ ల్యాబ్ వ్యవస్థాపకుడు పియూష్ వర్మ, సోషియెా హబ్ వ్యవస్థాపకుడు డి.ప్రవీణ్, మండీ ఫార్మా గ్రోబల్ హెడ్ సమీర్ దేశాయ్, జియాన్ లైఫ్ సైన్సెస్ మేనేజింగ్ డైరక్టర్ సురేష్ గార్గ్, అమెరికాలోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీ అంతర్జాతీయ కోర్సుల నిర్వహణ విభాగం డైరక్టర్ డాక్టర్.గ్రెగ్ కొలియర్ వ్యవహరించారని తెలిపారు.

gitam zoom meeting

స్టార్టప్ సంస్కృతిని విద్యార్థులలో పెంచడానికే పోటీలు: గీతం విసి

ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో స్టార్టప్ సంస్కృతి పెరుగుతోందని, యువత పారిశ్రామిక వేత్తలుగా మారడానికి ఆలోచనలే పెట్టుబడిగా దేశంలోను ప్రభుత్వాలు స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తున్నాయని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ పేర్కొన్నారు. గీతం స్మార్ట్ ఐడియాథాన్2021 విజేతలను అభినందిస్తూ ఆదివారం వర్చ్యువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణా లోని టి-హబ్ తరహలో అంకుర సంస్థల ప్రోత్సాహనికి అమెరికాలోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీ సహకారం తీసుకున్నామని తెలిపారు. గీతం పోటీలలో విజేతలను ఆయన అభినందించారు.

గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో పాటు వాటిని విజయవంతమైన స్టార్టప్ గా మలచడానికి సరైన బృందం అవసరమన్నారు. వినియోగదారుల అవసరాలు, మార్కెట్ అధ్యనం, పెట్టుబడుల సమీకరణ ప్రతి అంశం పైన లోతైన అవగాహన ఉంటే స్టార్టప్ లు విజయవంతం అవుతాయని పేర్కొన్నారు. నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీ నూతన ఆవిష్కరణల విభాగం డైరక్టర్ మార్క్ మేయర్, గీతం వెంచర్ డవలప్ మెంట్ సెంటర్ (వి.డి.సి.)శిక్షకులు జతిన్ జోసఫ్, అశుతోష్ తివారీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story