కంపు వాసనకు మంచి ర్యాంకింగ్‌ అడుగుతున్నారు

by Anukaran |
కంపు వాసనకు మంచి ర్యాంకింగ్‌ అడుగుతున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అత్యుత్తమ ర్యాంకింగ్ కోసం సానుకూలంగా ఓటేయాలని ప్రజలను బల్దియా అధికారులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన సిటిజన్ ఓటింగ్ ప్రక్రియలో మెరుగైన ర్యాంక్ ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. సిటీలో బహిరంగ చెత్త, రోడ్లపై మురుగు కాల్వల పరిస్థితిలో మార్పు రాలేదు. కనీసం జీహెచ్ఎంసీ కార్యాలయాలు సైతం పరిశుభ్రంగా లేకుండా కనిపిస్తుంటే.. స్వచ్ఛత ర్యాంకింగ్‌ ఎలా మెరుగుపడుతుందో బల్దియా అధికారులకే తెలియాలి.

30 సర్కిళ్ల పరిధిలో షిప్టుల వారీగా 20 వేల మంది పనిచేస్తుండగా.. అదనంగా స్వీపింగ్ మెషిన్లు సైతం ఏర్పాటు చేశాయి. గ్రేటర్‌లో రోజుకు 6నుంచి7 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా.. ఆటోలు, లారీల ద్వారా ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఇంత పకడ్బందీ వ్యవస్థ కలిగినా నగరంలో పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికలు, 150 వార్డుల వారీగా కార్యక్రమాలను సైతం జీహెచ్ఎంసీ చేపట్టింది. కానీ, నగరం రూపురేఖలను మార్చలేకపోయింది. ఇండ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంపై జీహెచ్ఎంసీ అవగాహన కల్పిస్తోంది. కానీ ఆ కార్యాలయాలే అపరిశుభ్రంగా కనిపిస్తుండంతో ఇక నగరాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుతారనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.

ర్యాంకింగ్‌లో వెనుకబాటు

రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు నీరు, చెత్త, బహిరంగ మూత్ర విసర్జన వంటివి సిటీలో నిత్య దృశ్యాలు.. మెట్రో సిటీలను స్వచ్ఛతలో ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ఇస్తోంది. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 4 వేల సిటీలు పోటీపడుతుంగా.. గత రెండేండ్లలో గ్రేటర్ స్థానం పడిపోయింది. జీహెచ్ఎంసీ స్థానాన్ని మెరుగుపరిచేలా ఓటింగ్ చేయాలంటూ బల్దియా అధికారులు కోరుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బల్దియా ఆఫీసులనే శుభ్రంగా ఉంచుకోలేని వారు సిటీని ఎలా శుభ్రంగా ఉంచగలరని సిటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మేయర్, కమిషనర్ ఉండే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారింది. ఇక జోనల్, సర్కిల్ ఆఫీసులు ఎలా ఉంటాయో మరి.. బల్దియా ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ టాయిలెట్లకు నీటి సరఫరా వ్యవస్థ సైతం సరిగా లేదు. మెట్ల దారుల్లో చెత్త, చెదారం, సిగరెట్లు, పాన్ మరకలతో దర్శనమిస్తున్నాయి. ఆఫీస్ క్యాంటీన్ పరిసరాల్లో నో స్మోకింగ్ అమలు కనిపించదు. చెత్త పేపర్లు, అపరిశుభ్ర పరిసరాలను వదిలేసిన జీహెచ్ఎంసీ అధికారులు రిన్నోవేషన్ పనులు చేపడుతున్నారు. డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలంటూ గతంలో సిటీ ప్రజలకు హుకూం జారీ చేశారు. కానీ తమ ఆఫీసుల్లోని దారులకు అడ్డంగా డెబ్రిస్‌ను తొలగించలేకపోతున్నారు. వివిధ పనుల మీద కార్యాలయాలకు తిరిగే ప్రజలకు, అధికారులకు ఈ వ్యర్థాలు అడ్డుగా ఉన్నాయి. సిటీ ర్యాంకు మెరుగుపడాలంటే ముందుగా జీహెచ్ఎంసీ కార్యాలయాలు బాగుపడాలంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed