లేని భూమికి మార్ట్‌గేజ్

by  |
లేని భూమికి మార్ట్‌గేజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారుల సహకారం ఉంటేచాలు.. డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. ఎక్కడైనా సృష్టించిన పత్రాలు చూపిస్తే సరిపోతుంది. అన్ని రకాల అనుమతులను ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇదంతా హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులంతా గప్‌చుప్ అయ్యారు. ప్రభుత్వ స్థలాన్ని, రోడ్లు కబ్జాకు గురి కాకుండా కాలనీవాసులు చేస్తోన్న ప్రయత్నానికి అడ్డు తగులున్నారు. అక్రమార్కులకే పెద్దలు, బల్దియా అధికారులు మద్దతు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు, రిజిస్ట్రేష‌న్ అధికారులు ఎంత అడ్డ‌గోలు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారో సైబ‌ర్ హిల్స్ లింకు రోడ్లను ఆక్ర‌మించి క‌డుతున్న అక్ర‌మ నిర్మాణాలు చూస్తే తెలుస్తుంది. వారి అనుమ‌తి ప‌త్రాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. లింకురోడ్డు భూమిని ఆక్ర‌మించి 86ఎ, 87ఎ అనే ప్లాట్లు 602 గ‌జాలు ఉన్న‌ట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అపార్టుమెంటు నిర్మాణానికి అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేశారు.

అస‌లు అటువంటి ప్లాట్లు ఉన్నాయా, అవి ఒరిజిన‌ల్ డాక్యుమెంట్లేనా, వాటికి పెట్టిన యూఎల్‌సీ ప‌త్రాలు స‌రైన‌వేనా ఇవేవీ చూసుకోకుండానే అపార్టుమెంటు నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు అనుమ‌తి ఇచ్చారు. ఆ అనుమ‌తి ప్ర‌కారం బాలాన‌గ‌ర్ రిజిస్ట్రేష‌న్ ఆఫీసులో మార్ట్‌గేజ్ డీడ్ కూడా రిజిస్ట‌ర్ చేశారు. విడ్డూరం ఏమిటంటే మార్ట్‌గేజ్ డీడ్‌లో 86ఎ, 87ఎ డీడ్‌ల డాక్యుమెంటు నెంబర్ల ప్ర‌స్తావ‌న లేదు. ఇంకా ఆశ్చ‌ర్య‌మేమంటే.. కాల‌నీ అసోసియేష‌న్ వాళ్లు సెర్చ్ చేయిస్తే, రిజిస్ట్రేష‌న్ ఆఫీసులో అటువంటి డాక్యుమెంట్లే లేవు. అంటే లేని భూమికి అనుమ‌తులు, మార్ట్‌గేజ్ ఒప్పందాలూ చేశార‌న్న‌మాట‌. ఎఫ్‌టీఎల్ ప‌రిధి నుంచి మిన‌హాయిస్తూ నిర‌భ్యంత‌ర ప‌త్రాన్ని కూడా ఇరిగేష‌న్ అధికారులు ఇచ్చార‌ని భూ య‌జ‌మానులు చెబుతున్నారు. వాస్త‌వానికి ఒరిజిన‌ల్ కొనుగోలు డాక్యుమెంట్ల (నంబ‌ర్లు-10774/1989, 5354/1989) ప్ర‌కారం రెండు ప్లాట్లు 86, 87ల‌లో ఉన్న‌ది 440 గ‌జాలు మాత్ర‌మే.

రోడ్డు మంజూరైనా అడ్డగింత

మాదాపూర్ ప్రధాన రహదారి నుంచి ఈ కాలనీ మీదుగా లింకు రోడ్డును మంజూరు చేస్తూ లేఖ నెంబర్.610/ఎ1/డబ్ల్యూజెడ్/జీహెచ్ఎంసీ/2009, తేదీ.10.7.2009 జారీ చేశారు. ఈ లింకు రోడ్డును జీహెచ్ ఎంసీ పాత క‌మిష‌న‌ర్లు ఎప్పుడో మంజూరు చేశారు. కానీ స్థానిక అధికారులు మాత్రం భూ క‌బ్జాదారుల‌తో కుమ్మ‌క్కై ఎప్ప‌టిక‌ప్పుడూ ఏదో ఒక సాకు చూపి రోడ్డు నిర్మాణాన్ని ఆపుతూ వ‌చ్చారు. భూ క‌బ్జాదారులు రోడ్డు భూమితో పాటు కాల‌నీలో మిగిలిన పార్కు స్థ‌లాన్నికూడా తామే కొన్న‌ట్టు ఏవో ప‌త్రాలు చూపిస్తూ అధికారుల‌ను బెద‌ర‌గొడుతున్నారు. కొంద‌రు అధికారుల‌ను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాస్త‌వానికి యూఎల్‌సీలు ఇవ్వ‌కుండా మిగిలిన భూమి ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని ఈ కాల‌నీ కేసులో హైకోర్టు 2006లోనే ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పును కూడా తిమ్మిని బ‌మ్మి చేయ‌డానికి భూబ‌కాసురులు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసినట్లు సమాచారం. సదరు స్థలం ప్రభుత్వానిదంటూ అన్నిరకాల ఆధారాలు చూపించినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని వెనుక మతలబు ఏమిటో అర్ధం కాక కాలనీవాసులు విస్మయానికి గురవుతున్నారు. దీని వెనుక అదృశ్య శక్తులు పని చేస్తుండడం వల్లే అక్రమ నిర్మాణాలను నిలిపివేయడం లేదని, నకిలీ పత్రాలను కూడా పరిశీలించడం లేదని మండిపడుతున్నారు.


Next Story

Most Viewed