- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి వినాయక నిమజ్జనం ఎక్కడ? జీహెచ్ఎంసీ తర్జన భర్జన
దిశ, తెలంగాణ బ్యూరో : గణేశ్ నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ జలాలు కలుషితమవుతున్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ప్రభుత్వాన్ని వివరణ కోరింది. రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేస్తున్న కారణంగా హుస్సేన్ సాగర్ జలాలు భారీ స్థాయిలో కలుషితమవుతున్నాయని, దీన్ని నివారించడానికి ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు బెంచ్ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. దీంతో ఈసారి నిమజ్జనం ఎక్కడ జరగాలనే చర్చలు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఇప్పటివరకు ప్రత్యామ్నాయాల గురించి వెల్లడించకపోవడంతో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులతో పాటు ప్రభుత్వ అధికారుల స్థాయిలోనూ చర్చలు మొదయ్యాయి. ఈ నెల 28న ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది.
ప్రతీ ఏటా వినాయక చవితి సందర్భంగా 11వ రోజున హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం జరగడం ఆనవాయితీ. ఐదు అడుగుల ఎత్తు మొదలు 40 అడుగుల వరకు విగ్రహాలు వేల సంఖ్యలో నిమజ్జనానికి హుస్సేన్ సాగర్‌కు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం సైతం ఇందుకోసం భారీ స్థాయి ఏర్పాట్లను చేస్తుంటుంది. కానీ ఈసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సీరియస్‌గా స్పందించిన న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. గతేడాది తరహాలోనే కరోనా ఆంక్షలను ఈసారి కూడా అమలు చేయాలని, నగరంలో కరోనా సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదని, వైరస్ వ్యాప్తికి నిమజ్జనం కారణమవుతుందని వ్యాఖ్యానించి విచారణను వాయిదా వేసింది.
దీంతో ప్రత్యామ్నాయ చర్యలపై జీహెచ్ఎంసీ ఈ నెల 28న చర్చించాలనుకుంటున్నది. నగరంలో దాదాపు ఐదు లక్షల విగ్రహాల వరకు వినాయక చవితి సందర్భంగా వివిధ కాలనీల్లో ప్రతిష్టించవచ్చని అంచనా. ఇందులో దాదాపు లక్ష వరకు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి వస్తుంటాయి. జలాల కలుషితంపై హైకోర్టు తదుపరి విచారణ సమయానికి జీహెచ్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.