ఎడారి మధ్యలో లగ్జరీ ఇల్లు.. ధర రూ.12.9 కోట్లు

by Shyam |
ఎడారి మధ్యలో లగ్జరీ ఇల్లు.. ధర రూ.12.9 కోట్లు
X

దిశ, ఫీచర్స్ : పోస్ట్ పాండమిక్ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఓపెన్-ప్లాన్ ఆఫీసెస్, ఓపెన్ రెస్టారెంట్స్, వర్కింగ్ ఫ్రమ్ హిల్స్ వంటి కాన్సెప్ట్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలోనే అరిజోనాలోని స్కాట్స్‌డేల్ అనే డిజర్ట్ సిటీలోని ‘ద బెకాన్ హౌజ్ ఎట్ మౌంటెయిన్ డిజర్ట్’ అనే ఎడారి ప్యాలెస్ 2019లో $ 13 మిలియన్ల ధర ఉండగా.. ఏడాదిలోనే $ 16.5 మిలియన్లు పలుకుతోంది. ఇక అమెరికా, కాలిఫోర్నియాలోని మొజావే ఎడారి (Mojave desert) మధ్యలో జోషువా ట్రీ ప్రాంతంలో మరో ఇంటి నిర్మాణం జరుగుతోంది. దీని విలువ రూ.12.9 కోట్ల పైమాటే. ట్రాఫిక్, రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంత వాతావరణం కోరుకునే వారికోసం సిద్ధమవుతున్న ఈ ఇంటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

చాలామంది నగర జీవితానికి అలవాటు పడిపోయారు. ఎంత హడావిడి ఉన్నా, నగరంలో దొరికే ఉపాధికోసం ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతుంటారు. కానీ కొందరు రద్దీ ప్రదేశాలకు దూరంగా జీవించాలనుకున్నప్పటికీ, ప్రాథమికంగా ఆధునిక సౌకర్యాలు ఉండాలని కోరుకుంటారు. దానికోసం నగరం బయట విల్లాస్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి ఇల్లే మొజావే ఎడారి మధ్యలో నిర్మిస్తున్న ‘ఎల్ సిమెంటో యునో’. దీన్ని ప్రముఖ ఆర్కిటెక్ట్ గ్రూప్ అర్బన్ ఆర్కిటెక్చరల్ స్పేస్ గ్రూప్ పూర్తిగా కాంక్రీటుతో నిర్మిస్తోంది. ఇందులో రెండు బెడ్‌రూమ్స్, రెండు బాత్‌రూమ్స్‌తో సహా లైబ్రరీ, రీడింగ్ కార్నర్‌‌లు ఉన్నాయి. లోహం (metal), ఫామ్ (foam)తో తయారైన ఫ్రేములతో ఫ్లోర్‌ని తయారుచేశారు. అంతేకాదు ఈ గోడల్లో కూలింగ్ మెకానిజం ఉండటంవల్ల ఎడారి వేడి సమస్యే ఉండదని బిల్డర్స్ చెబుతున్నారు.

ఇటీవల ఈ ఇంటి చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్పేస్ గ్రూప్.. దీని ధర రూ. 12.9 కోట్లగా కోట్ చేసింది. ఎవరైనా కిరాణా షాపింగ్‌కు వెళ్లాలనుకున్నా లేదా వ్యక్తులను కలవాలనుకున్నా కారు లేదా బైక్‌లో వెళ్లాల్సిందే. చుట్టుపక్కల ఏమీ ఉండవు. నివేదికల ప్రకారం దీన్ని RSG3D బిల్డింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి నిర్మించారు. ఇంటి నిర్మాణం జూన్ 2021లో ప్రారంభం కాగా నగర వాతావరణంతో డిటాక్స్ కోరుకునే ఎవరైనా సరే ఈ ఇల్లు సొంతం చేసుకోవచ్చని బిల్డర్స్ తెలిపారు.

Advertisement

Next Story