2021-22లో జీడీపీ 10.4 శాతం బౌన్స్ : ఇండ్-రా

by Harish |
2021-22లో జీడీపీ 10.4 శాతం బౌన్స్ : ఇండ్-రా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 2021-22లో 10.4 శాతం బౌన్స్ అవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) అంచనా వేసింది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి 0.3 శాతం సానుకూలంగా మారుతుందని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. 2021-22లో ఆర్థికవ్యవస్థ రికవరీ వి-ఆకారంలో ఉంటుందని, జీడీపీ పరిమాణం 2019-20 నాటి స్థాయిని అధిగమిస్తుందని ఇండ్-రా తెలిపింది. ఇక, పూర్తిస్థాయి రికవరీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే కనిపిస్తుందని సంస్థ పేర్కొంది. ఇటీవల కరోనా కేసులు తక్కువ ఉన్నప్పటికీ, కరోనా ప్రభావం కారణంగా టీకా సాధారణ స్థాయిలో లభించే వరకు ఆర్థిక కార్యకలాపాలు సాధారణస్థితికి చేరుకునేందుకు ఆలస్యమవుతుందని ఇండ్-రా వివరించింది.

గతేడాది ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్‌లో లేనప్పటికీ తాజా బడ్జెట్‌లో డిమాండ్‌ను తీర్చే స్థాయిలో ప్రకటనలు ఉండటంతో ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని, తద్వారా ప్రభుత్వ తుది వినియోగ వ్యయం 2021-22లో 10.1 శాతానికి పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. ప్రైవేట్ వినియోగ వ్యయం 2021-22లో 11.2 శాతం పెరుగుతుంది. ముఖ్యంగా ఫార్మా, హెల్త్‌కేర్, టెలికాం రంగాల అండతో ఈ స్థాయిలో వ్యయం పెరిగనున్నాయి. అయితే, ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్న హోటల్, ట్రావెల్ అండ్ టూరిజం, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి సేవల రంగాల్లోని ఎంపిక చేసిన విభాగాలు ఇంకా కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని ఇండ్-రా అభిప్రాయపడింది. అదేవిధంగా, 2021-22లో జీడీపీలో 6.8 శాతం ఆర్థిక లోటు సాధించవచ్చని ఇండ్-రా వెల్లడించింది.

Advertisement

Next Story