మీరు త్వరలో శుభవార్త వినబోతున్నారు!

by  |
మీరు త్వరలో శుభవార్త వినబోతున్నారు!
X

గౌరవెల్లి రిజర్వాయర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే పనులు పూర్తి చేసి గోదావరి జలాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రిజర్వాయర్ ద్వారా మొత్తంగా 1.06 లక్షల ఎకరాలను సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ రిజర్వాయర్ కింద భూమి కోల్పోయిన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. త్వరలోనే వాటిని చెల్లిస్తామని ఎవరూ ఆందోళన చెందొద్దని అధికారులు చెబుతున్నారు.

దిశ, హుస్నాబాద్ : మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ వనులు తుదిదశకు చేరుకున్నాయి. దసరాలోగా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 90వేల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 16వేల ఎకరాలకు మొత్తంగా 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముంది. సిద్దిపేట, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్ జిల్లాలకు ఈ రిజర్వాయర్‌తో ప్రయోజనం చేకూరనుంది. ప్రధానంగా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారనుంది.

సాగులోకి 1.06లక్షల ఎకరాల ఆయకట్టు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర (మిడ్‌మానేర్) జలాశయం నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి ప్రాజెక్టులోకి గోదావరి జాలాలు గతేడాది వచ్చి చేరాయి. అక్కడి నుంచి ఓపెన్ సొరంగం ద్వారా గౌరవెల్లి రిజర్వాయర్‌కు రానున్నాయి. గతంలో గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం 1.41 టీఎంసీలు ఉండగా, ప్రాజెక్టుల రీడిజైన్‌లో భాగంగా దాని సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారు. ఈ రిజర్వాయర్ కింద 1.06 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. తోటపల్లి రిజర్వాయర్ నుంచి సుమారు 11 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, నారాయణపూర్ నుంచి సుమారు16 కిలోమీటర్ల మేర సొరంగం ద్వారా రేగొండ సర్జిపూల్‌కు నీళ్లు చేరుతాయి. రేగొండ వద్ద 110 మీటర్ల లోతు, 25 మీటర్ల వెడల్పు 50 మీటర్ల పొడవుతో సర్జిపూల్ పంపును నిర్మిస్తున్నారు. ఈ పనులు సైతం చివరి దశకు చేరాయి. సర్జిపూల్ నుంచి 130 మీటర్ల లోతు, 17 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల పొడవుతో నిర్మించిన పంపుహౌస్‌లోకి గోదావరి జలాలు చేరుకోనున్నాయి. ఇక్కడ 32 మొగావాట్లు కలిగిన మూడు మోటార్లను బిగించి వాటి సహాయంతో గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను విడుదల చేస్తారు.

8.23 టీఎంసీల నీటిసామర్థ్యంతో..

గౌరవెల్లి రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలు సామర్థ్యంతో నిర్మిస్తుండగా రిజర్వాయర్ పొడవు 10.56 కిలోమీటర్లు, 41 మీటర్ల ఎత్తుతో రెండు కిలోమీటర్ల పొడవు కలిగిన గుట్టలను కలుపుకుని రాతికట్టను నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 3,870 ఎకరాల భూమి అవసరం కాగా 3,500 ఎకరాల భూమిని భూసేకరించారు. మిగతా 370 ఎకరాలకు డబ్బులు చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా 200 ఎకరాల విషయం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ రిజర్వాయర్ కింద గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, కొత్తపల్లితో పాటు సోమజితండా, సేవ్యానాయక్ తండా, బొంద్యానాయక్ తండా, జాలుబాయితండా, చింతల్ తండా, తిరుమల్‌నాయక్ తండాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి.

చివరి దశలో పనులు

గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రస్తుతం 85 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఓపెన్ కెనాల్ సొరంగ పనులు పూర్తయ్యాయి. సర్జిపూల్, పంపుహౌస్ పనులు చివరిదశలో ఉన్నాయి. రిజర్వాయర్ బండ్ నిర్మాణంలో భాగంగా112.65 క్యూబిక్ మీటర్ల మట్టిని, 24,281 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 24,830 మీటర్ల రివెట్ మెంట్ 4,82,979 క్యూబిక్ మీటర్ల ఇసుక పనులు పూర్తిచేశారు.

హుస్నాబాద్ సస్యశ్యామలం: సతీశ్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తున్నాం. గోదావరి జలాలతో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు హుస్నాబాద్ ప్రాంతానికే వన్నే తెచ్చాయి. సీఎం కేసీఆర్ స్వయంగా రిజర్వాయర్‌ను సందర్శించి రీడిజైన్ చేసి 8.23 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచారు. ఇటీవల కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

నిర్వాసితులు అధైర్యపడొద్దు: ఆర్డీఓ జయచంద్రారెడ్డి

గౌరవెల్లి ప్రాజెక్టుకు 3870 ఎకరాల భూమి అవసరమవ్వగా 3500 ఎకరాల సేకరణ పూర్తయింది. మిగతా 370 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఎకరాకు రూ.6.95లక్షలు చెల్లించేందుకు సిద్దంగా ఉండగా అందులో 200 ఎకరాలకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పునరావాసం, పునరోపాధికి సంబంధించిన 937 కుటుంబాలకు గానూ 927 కుటుంబాలకు రూ.8లక్షలు చెల్లించగా మిగతా 10 కుటుంబాలు ఉన్నాయని వారితో పాటు 8.23 సామర్థ్యం పెంచగా 180 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్న వారికి సైతం చట్టం ప్రకారం డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు కింద 693 ఇండ్లకు గానూ 686 ఇండ్లకు 2013 నుంచి 2015 మధ్య కాలంలో డబ్బులు చెల్లించాం. మిగతా 7 ఇండ్ల డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. జీఓ ప్రకారం 18 ఏండ్లు నిండిన 144మందికి రూ.2లక్షల చొప్పున మంజూరవ్వగా నిర్వాసితులు డబ్బులు తీసుకోవడానికి మందుకురావడం లేదు. ప్రభుత్వం భూ నిర్వాసితును అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవ్వరూ ఆధైర్యపడొద్దు.



Next Story