ప్రగతి భవన్‌లో గణేశ్ చతుర్ధి.. సీఎం కేసీఆర్‌తో సహా..

by Shyam |
Cm Kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో వినాయక చవిత వేడుకలు శుక్రవారం జరిగాయి. కేసీఆర్‌తో పాటు సతీమణి, కుమారుడు కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీ సంతోష్ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. వరుసగా తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలో గడిపిన సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతీ సంవత్సరం జరుపుకున్నట్లుగానే మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయక చవిత వేడుకలను కేసీఆర్ కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు కలగకుండా చూడాలని దేవుడ్ని కేసీఆర్ ప్రార్థించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పండుగ శుభాకాంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మొదలైన వినాయక చవిత సంబురాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుతూ విఘ్నేశ్వరుడిని పూజిస్తారని, విఘ్నాలు తొలగించే దైవంగా హిందు సంప్రదాయాల్లో వినాయకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు. గణేశుని ఉత్సవాలను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed