క్వారంటైన్‌లోకి గద్వాల ఎమ్మెల్యే

by Shyam |
క్వారంటైన్‌లోకి గద్వాల ఎమ్మెల్యే
X

దిశ, న్యూస్ బ్యూరో: గద్వాల ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ శనివారం నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కచ్చితంగా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి గద్వాల ఆర్డీవో స్పష్టం చేశారు. టీఆర్ఎస్ గద్వాల మున్సిపల్ నాయకుడు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేశవులు, వైస్ చైర్మన్ బాబర్ తదితరులు పాల్గొన్నారు.

తాజాగా మృతుని కుటుంబంలో ఒకరికి కొవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న చాలా మంది ఆందోళనపడ్డారు. తొలుత ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేశవులు శనివారం ఉదయం నుంచే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. లాక్‌డౌన్‌లో భాగంగా రోజూ రోడ్డుమీదకు వచ్చి ప్రజల్లో అవగాహన కలిగిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే శనివారం నుంచి ఇంటికే పరిమితమయ్యారు. రోడ్డుమీదకు రాలేదు. హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన విషయాన్ని అటు ఎమ్మెల్యేగానీ ఇటు రెవెన్యూ అధికారులుగానీ ధృవీకరించలేదు. కాని ఆదివారం ఉదయం ఆర్డీవో స్వయంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి 14 రోజుల క్వారంటైన్ నిబంధన గురించి వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే శనివారం నుంచే క్వారంటైన్‌లోకి వెళ్లిన విషయాన్ని వివరించారు. అయితే, టీఆర్ఎస్ నాయకుడి అంత్యక్రియల్లో వీరితో పాటు మరో నలుగురు కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు. వారి క్వారంటైన్ గురించిన వివరాలు తెలియరాలేదు.

Tags: Gadwal MLA, Municipal Chairman, Vice Chairman, Self Quarantine, covid 19 case

Advertisement

Next Story

Most Viewed