- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హై రిస్కులో ఫ్రంట్‌లైన్ వారియర్స్
దిశ, న్యూస్ బ్యూరో: ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కరోనా కట్టడికి ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లు హై రిస్కులో ఉన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర మెడికల్ స్టాఫ్, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది… చివరకు మీడియా ప్రతినిధులు సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఫ్రంట్‌లైన్ వారియర్లు సుమారు ఆరు శాతం (300కు పైగా) ఉంటారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అంచనా. రాష్ట్రంలో ఇప్పటివరకు 70 మందికి పైగా డాక్టర్లు, సుమారు 40 మంది హౌస్ సర్జన్లు, వందమందికిపైగా పోలీసులు, 30 మందికిపైగా పారిశుధ్య సిబ్బంది, సుమారు 60 మంది మీడియా ప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు. ఇంతకు నాలుగు రెట్ల సంఖ్యలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నాలుగు రంగాలకు చెందినవారు వైరస్‌తో ఉన్న వ్యక్తులకు దగ్గరగా ఉండేవారైనందున హై రిస్కు జోన్‌లో ఉన్నట్లేనని, వీరికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది.
ముఖ్యమంత్రికి నోట్
హై రిస్కు జోన్‌లో ఉన్న ఈ ఫ్రంట్‌లైన్ వారియర్లలో వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందో, ఇప్పటివరకు ఎంతమందికి పాజిటివ్ వచ్చిందో తెలియజేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ నెల 5న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రికి ఒక నోట్ ను అందజేసింది. నోట్ తయారుచేసేనాటికి మొత్తం 169 మంది వైరస్ బారిన పడినట్లు పేర్కొంది. రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే నిమ్స్‌లో డాక్టర్లకు, ఓపీ సేవల్లో ఉండే వైద్య సిబ్బందికి, పేట్లబురుజు ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు హౌస్ సర్జన్లకు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారులకు, పోలీస్ కానిస్టేబుళ్ళకు, మీడియా సిబ్బందికి పదుల సంఖ్యలో కరోనా సోకింది. పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే వీరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటివరకూ వీరికి కనీసంగా లక్షణాలు కూడా లేవు. ఈ రంగాల్లోని ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ప్రభుత్వానికి వత్తిడి పెరిగినందువల్లనే టెస్టులు జరగడం, ఆ తర్వాత పాజిటివ్ పేషెంట్లుగా తేలడం జరిగింది.
వైరస్ ఎందుకు సోకుతోంది?
డాక్టర్లు ఓపీలను పరిశీలించేటపుడు, ఆపరేషన్ థియేటర్లలో ఉన్నపుడు, పాథోజెన్ ప్రభావానికి గురైనపుడు ఎక్కువగా వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారని నోట్ లో పేర్కొన్నారు. పోలీసులు ఎక్కువ సమయం చెక్‌పోస్టుల దగ్గర డ్యూటీలో ఉన్నప్పుడు, వివిధ అవసరాల కోసం స్టేషన్లకు వచ్చే ప్రజలతో మాట్లాడేటప్పుడు సోకినట్లు వివరించారు. ఆసుపత్రుల్లోని వార్డుల్లో పనిచేస్తున్న క్రమంలోనే పారిశుధ్య సిబ్బంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు నోట్ లో పొందుపరిచారు. ఇక మీడియా ప్రతినిధులు మాత్రం వివిధ సందర్భాల్లో కవరేజ్‌కు వెళ్లి వైరస్ బారిన పడ్డారు. ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్, గాంధీ, పేట్లబురుజు, గచ్చిబౌలి టిమ్స్ తదితర ఆసుపత్రులకు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో వచ్చినవారితో మాట్లాడే సమయంలో డాక్టర్లు, సిబ్బందికి వైరస్ అంటుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వివరించారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రి ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోకపోయినప్పటికీ, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నుంచి సిబ్బందిని అక్కడికి డిప్యూటేషన్ మీద పంపినందువల్లనే ఇక్కడి నుంచి అక్కడికి వైరస్ వ్యాపించిందని చెప్పారు. కొన్ని సమయాల్లో ఆంబులెన్స్ డ్రైవర్ల ద్వారా కూడా వ్యాపించిందని, శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న సమయంలో అనుమానిత పేషెంట్లను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించే సమయంలో వైరస్ బారిన పడ్డారని వివరించారు.
ఫ్రంట్‌లైన్ వారియర్లకు నిర్ధారణ పరీక్షలు
కరోనాతో పోరాడే సమయంలో ఎక్కువగా ఫ్రంట్‌లైన్ సిబ్బంది వైరస్ బారిన పడుతున్నందున, ఇప్పుడు ప్రభుత్వం చేయనున్న యాభై వేల పరీక్షల్లో వీరికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం ఈ నాలుగు రంగాల్లో వైరస్ బారిన పడినవారిలో సుమారు 72.2% మంది పురుషులు ఉన్నారని, వయసుల వారీగా చూస్తే 65 ఏళ్లలోపు వారేనని వివరించారు. ఈ మొత్తంలో 88% మంది ప్రభుత్వ సిబ్బందేనని, మిగిలినవారు మీడియా, పారిశుధ్య సిబ్బంది అని తెలిపారు. పోలీసులు, వైద్య సిబ్బంది దాదాపుగా సమాన సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. పారిశుధ్య సిబ్బందిలో ఎక్కువ మంది వార్డు బాయ్‌లు, హౌజ్ కీపింగ్ స్టాఫ్, అటెండర్లు ఉన్నట్లు తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలోని జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బందికి తొలుత కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామన్నారు. ఆ తర్వాత హై రిస్కులో ఉన్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫీల్డ్ స్టాఫ్ తదితరులకు చేస్తామని తెలిపారు. మీడియాలో ఒకరిద్దరికి వైరస్ పాజిటివ్ అని తేలిన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పటికి సుమారు 300 మందికి పరీక్షలు చేశామన్నారు. అవి చేసిన తర్వాతనే సుమారు 60 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలిందన్నారు. ఇందులో లక్షణాలు ఉన్నవారు పది మందికి తక్కువేనని, మిగిలినవారికి ఇప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు.