లైవ్‌స్ట్రీమ్‌లో చనిపోవడమే ఆయన చివరి కోరిక

by  |
లైవ్‌స్ట్రీమ్‌లో చనిపోవడమే ఆయన చివరి కోరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పుట్టినవాడు గిట్టక తప్పదు’ అన్నది జగమెరిగిన సత్యం. ప్రాణం పోసుకున్న ప్రతి జీవి ఏదో ఒక రోజు.. తనువు చాలించాల్సిందే.. అదే సృష్టి ధర్మం. ఒకప్పుడు మనిషి ఆయుష్షు 100 ఏళ్ల వరకు ఉండేది. కానీ మారిన జీవన పరిస్థితుల వల్ల.. మానవుని ఆయుర్థాయం సగటు 70కి తగ్గింది. అందుకే కాస్త వృద్ధాప్య చాయలు మీద పడగానే.. వీలునామా రాయడంతో పాటు అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటారు. కొందరికి తమకు ఇక మరణం తప్పదని తెలిసిపోయాక.. ఆఖరి క్షణాలను ఆనందంగా గడపాలని, మిగిలిపోయిన కోరికలేవైనా ఉంటే తీర్చుకోవాలని కోరుకుంటారు. అయితే, ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం.. తన చావును ప్రజలంతా చూడాలని, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్‌ చేయాలని తన ఆఖరి కోరికగా కోరాడు.

ఇండియాలో కారుణ్య మరణాలకు అవకాశం లేదు. కానీ, కొన్ని దేశాల్లో కారుణ్య మరణాలు చట్టబద్ధమే. ఫ్రాన్స్‌లోని డిజోన్‌కు చెందిన 57 ఏళ్ల అలైన్ కోక్ కూడా కారుణ్య మరణాన్ని(యూథనాసియా) కోరుకున్నాడు. ఇందుకోసం ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు లేఖ రాశాడు. ఏదైనా మందుతో నొప్పి లేని మరణానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. అయితే, మాక్రాన్ ఆయన విన్నపాన్ని తిరస్కరించారు. ఇంతకీ కోక్‌కు ఏమైందంటే.. ఆయన వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అతనిలో నడిచే శక్తి కూడా లేకపోవడంతో వీల్ చైర్‌కే పరిమితమై, కదల్లేని స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం కన్నా.. చనిపోవడమే ఉత్తమమని భావించాడు. అందుకోసమే ప్రెసిడెంట్‌ను వేడుకున్నాడు.

‘నేను మరో వారం కన్నా ఎక్కువగా బతకను’ అని నాకు తెలుసు. టైమ్ గడుస్తున్న కొద్దీ.. నాకు ఆందోళన పెరుగుతోంది. నేను అనుభవిస్తున్న వ్యాధికి చికిత్స లేదు. ఈ నొప్పిని భరించలేకే నేను చనిపోవాలని నిశ్చయించుకున్నాను’ అని ప్రెసిడెంట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే, ప్రెసిడెంట్ అందుకు ఒప్పుకోకపోవడంతో లైవ్ స్ట్రీమ్‌లో చనిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ‘నా చావు ద్వారా నేను ప్రజల్లో అవగాహన తేవాలనుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ చివరి దశలో ఉండేవారు చనిపోయేందుకు నరకయాతను అనుభవిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు చనిపోయే హక్కు ఇవ్వాలి. అందుకోసమే.. నా చావును లైవ్‌లో ప్రసారం చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపాడు. మరో నాలుగైదు రోజుల్లోనే అంతా తన చావును చూడవచ్చని పేర్కొన్నాడు. శనివారం (సెప్టెంబరు 5) నుంచి ఆహారం తీసుకోవడం మానేశాడు. తన చావును అందరూ చూడాలంటూ తన మంచానికి మొబైల్, కెమెరాలను బిగించి ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ చేస్తున్నాడు.

ఫ్రెంచ్ చట్టాల ప్రకారం కారుణ్య మరణానికి అనుమతి లేదు. 2016లో వచ్చిన ‘యూథనాసియా’ ప్రకారం మరణం చివరి అంచులో.. అన్‌కాన్షియస్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే కారుణ్య మరణానికి ఆదేశాలను ఇస్తుంది.


Next Story

Most Viewed