ఐపీఎల్‌లో డబ్బుల వరద

by  |
ఐపీఎల్‌లో డబ్బుల వరద
X

దిశ, స్పోర్ట్స్: 1983.. వన్డే వరల్డ్ కప్. ఇదే టీమ్‌ ఇండియాను క్రికెట్ విశ్వవిజేతగా నిలిపింది. ఆ సమయంలో టీమ్‌ ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు రూ.1500. అదనంగా రూ.600 డీఏ వచ్చేది. అదీ మూడ్రోజులకు ఒకసారి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభిస్తే ఒక షాంపేన్ బాటిల్ ఇచ్చేవాళ్లు. ఇంతకుమించి ఏమీ అందేవి కావు.

ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ శకం నడుస్తున్నది. అనామక ఆటగాడికి కూడా రూ.లక్షలు చెల్లిస్తున్నారు. అదే స్టార్ ప్లేయర్‌కు రూ.కోట్లు ధార పోస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌లో జీతం రూపంలో అత్యధికంగా విరాట్ కోహ్లీ రూ.17కోట్లు, ధోని రూ.15కోట్లు, రోహిత్ శర్మ రూ.15కోట్లు అందుకుంటున్నారు. ప్రపంచంలో ఏ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడినా ఏడాదికి కూడా ఇంత జీతం రాదు. కానీ, కేవలం 60 రోజులు ఐపీఎల్ ఆడితే చాలు డబ్బులే డబ్బులు.

మారిన బీసీసీఐ రాత

ప్రపంచ క్రికెట్‌లోకి పెట్టుబడి(బ్రాడ్‌కాస్ట్) ప్రవేశించగానే బోర్డుల ఆస్తులు, నగదు నిల్వలు అమాంతం పెరిగాయి. వీటిలో బీసీసీఐని ఐపీఎల్ మరో మెట్టులో నిలిపింది. ఈ క్రికెట్ లీగ్‌ను బీసీసీఐ ఉనికి కోసం ప్రారంభించినా ప్రస్తుతం బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారింది. అందుకే, ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ వాయిదా వేయించి కరోనా సంక్షోభంలో కూడా ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేపారు. 2008లో తొలిసారి ఫ్రాంచైజీలను వేలం వేశారు. ఒక్కో ఫ్రాంచైజీ బేస్ ధర 50 మిలియన్ డాలర్లుగా బీసీసీఐ నిర్ణయించింది. 111.90 మిలియన్ డాలర్లు వెచ్చించి ముంబయి ఇండియన్స్ జట్టును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సొంతం చేసుకుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 111.60 మిలియన్ డాలర్లకు వ్యాపారవేత్త విజయ్ మాల్యా, డెక్కన్ చార్జర్స్‌ను 107 మిలియన్ డాలర్లకు క్రానికల్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఎనిమిది ఫ్రాంచైజీల వేలంతో బీసీసీఐ ఖజానాలో 723.59 మిలియన్ డాలర్లు వచ్చి చేరాయి. అప్పటి డాలర్ రేటు ప్రకారం ఈ మొత్తం రూ.3,560కోట్లు. ఇక ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పోటీ పడి మరీ కొనుగోలు చేశాయి. అప్పట్లోనే ఎంఎస్ ధోని కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.6కోట్లు వెచ్చించింది. ఇలా డబ్బులను క్రికెట్ లీగ్‌ కోసం నీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తూ రూ.వేల కోట్లు ధారపోశారు.

క్రికెటర్లకు చెల్లింపుల్లో మిస్టరీ

ఐపీఎల్‌లో ఆటగాళ్ల కొనుగోలు కోసం ఎంత ఖర్చు చేయాలనే విషయమై బీసీసీఐ ఒక నిబంధన విధించింది. దీనినే పర్స్ వాల్యూ అంటారు. దీని విలువ ఒక్కో జట్టుకు రూ.82కోట్లుగా నిర్ణయించారు. కొంత మంది ఆటగాళ్లు ఒకే ఫ్రాంచైజీ తరఫున ఏళ్ల తరబడి ఆడుతున్నారు. వారికి ఒకవైపు భారీగా జీతాలు చెల్లిస్తున్నారు. అయితే, అధికారికంగా వాళ్ల జీతాలు పెంచితే పర్స్ వాల్యూ రూ.82కోట్లను మించిపోతుంది. అందుకే ఫ్రాంచైజీలు అడ్డదారులు తొక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గత 13 సీజన్లుగా ఎంఎస్ ధోని సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా ఆ జట్టు యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్‌లో డైరెక్టర్ హోదా కల్పించింది. ఆ హోదాలో అతనికి లాభాల వాటా తప్పక ఉంటుంది.

విరాట్ కోహ్లీ తన సొంత బ్రాండ్ రాంగన్‌ను ఆర్సీబీ జట్టు ద్వారా ప్రమోట్ చేస్తున్నాడు. తన స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థనూ ఆర్సీబీతో జట్టు కట్టించాడు. రోహిత్ శర్మకు విలువైన బహుమతులను రిలయన్స్ ఇండస్ట్రీస్ అందిస్తున్నదని క్రికెట్ సర్కిల్స్‌లో చెప్పుకుంటారు. 2015లో ముంబయి ఇండియన్స్‌ రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇందుకు ప్రతిఫలంగా రోహిత్‌కు రూ.30కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్ బహుమతిగా అందినట్లు వార్తలు వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్‌‌కు మొదట్లో వాటాలు ఉండేవి. ఆ ఫ్రాంచైజీని లలిత్ మోడీ బంధువు నడిపించేవాడు. కానీ, లలిత్ నిష్క్రమణ తర్వాత ఫ్రాంచైజీని అమ్మేశారు. ఇలా ప్రతీ ఫ్రాంచైజీ తన ఆటగాళ్లకు అధికారికంగా ఇచ్చే జీతంతోపాటు అనధికారికంగా డబ్బులు, బహుమతులు, షేర్లు తదితర రూపాల్లో అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తున్నది.

భారీ జీతాలు

1. విరాట్ కోహ్లీ రూ.17కోట్లు
2. పాట్ కమిన్స్ రూ. 15.5 కోట్లు
3. ఎంఎస్ ధోని రూ.15 కోట్లు
4. రోహిత్ శర్మ రూ.15 కోట్లు
5. రిషబ్ పంత్ రూ.15 కోట్లు
6. డేవిడ్ వార్నర్ రూ.12.5 కోట్లు
7. స్టీవ్ స్మిత్ రూ.12.5 కోట్లు
8. సునిల్ నరైన్ రూ.12.5 కోట్లు
9. బెన్ స్టోక్స్ రూ.12.5 కోట్లు
10. సురేష్ రైనా రూ.11 కోట్లు
12. ఏబీ డి విలియర్స్ రూ.11 కోట్లు
13. మనీశ్ పాండే రూ.11 కోట్లు
14. కేఎల్ రాహుల్ రూ.11 కోట్లు
15. హార్దిక్ పాండ్యా రూ.11 కోట్లు
16. గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ.10.75 కోట్లు
17. క్రిస్ మోరిస్ రూ.10 కోట్లు
18. రషీద్ ఖాన్ రూ.9 కోట్లు
19. కృనాల్ పాండ్యా రూ.8.8 కోట్లు
20. భువనేశ్వర్ కుమార్ రూ.8.5 కోట్లు
21. ఆండ్రీ రస్సెల్ రూ.8.5 కోట్లు
22. షెల్డన్ కోట్రెల్ రూ.8.5 కోట్లు
23. సంజూ శాంసన్ రూ.8 కోట్లు
24. నాథన్ కౌల్టర్ నైల్ రూ.8 కోట్లు
25. కేదార్ జాదవ్ రూ.7.8 కోట్లు
26. షిమ్రోన్ హెట్‌మెయర్ రూ.7.75 కోట్లు
27. రవిచంద్రన్ అశ్విన్ రూ.7.6 కోట్లు
28. దినేశ్ కార్తీక్ రూ.7.4 కోట్లు
29. జోఫ్రా ఆర్చర్ రూ.7.2 కోట్లు
30. రవీంద్ర జడేజా రూ.7 కోట్లు
31. జస్ప్రిత్ బుమ్రా రూ. 7 కోట్లు
32. శ్రేయస్ అయ్యర్ రూ.7 కోట్లు
33. పియుష్ చావ్లా రూ.6.75 కోట్లు
34. డ్వేన్ బ్రావో రూ.6.4 కోట్లు
35. ఇషాన్ కిషన్ రూ.6.2 కోట్లు
36. కృష్ణప్ప గౌతమ్ రూ.6.2 కోట్లు
37. యజువేంద్ర చాహల్ రూ.6 కోట్లు
38. కుల్దీప్ యాదవ్ రూ.5.8 కోట్లు
39. కరుణ్ నాయర్ రూ.5.6 కోట్లు
40. సామ్ కరన్ రూ.5.5 కోట్లు
41. కిరాన్ పొలార్డ్ రూ.5.4 కోట్లు
42. అజింక్య రహానే రూ.5.25 కోట్లు
43. ఇయాన్ మోర్గన్ రూ.5.25 కోట్లు
44. శిఖర్ ధావన్ రూ.5.2 కోట్లు
45. కరన్ శర్మ రూ.5 కోట్లు
46. శివమ్ దూబే రూ.5 కోట్లు
మొత్తం రూ.396.15కోట్లు

ఒక్కో ఫ్రాంచైజీ జీతాల కోసం ఏడాది ఖర్చు

చెన్నై సూపర్ కింగ్స్ రూ.84.85 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ రూ.76 కోట్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రూ.68.50 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.76.5 కోట్లు
ముంబయి ఇండియన్స్ రూ.83.05 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ రూ.70.25 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.78.6 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.74.9 కోట్లు
మొత్తం: రూ. 612.65 కోట్లు
– జీతాలు కాకుండా ఆటగాళ్ల రవాణా, వసతి, భోజనం ఇతర సౌకర్యాల కోసం ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు పెడుతుంటాయి.


Next Story

Most Viewed