అవసరమైతే భారత్‌కు మా బలగాలను అందిస్తాం : ఫ్రాన్స్ రక్షణ మంత్రి

by  |
అవసరమైతే భారత్‌కు మా బలగాలను అందిస్తాం : ఫ్రాన్స్ రక్షణ మంత్రి
X

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐరోపా దేశం ఫ్రాన్స్ భారత్‌కు అండగా నిలుస్తామని ప్రకటించింది. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొంటూ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు సహరిస్తామని, అవసరమైతే భద్రతా బలగాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ ఫ్లోరెన్స్ పార్లీ సోమవారం ఒక లేఖ రాశారు. గాల్వాన్ ఘటనను గుర్తుచేస్తూ 20 మంది వీరజవాన్లకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై భారత్‌కు సానుభూతి ప్రకటించినట్టు తెలిపారు. అంతేకాదు, అవసరమైతే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యేందుకు సంసిద్ధతను వ్యక్తపరిచారు. కాగా, ఈ ఇరుదేశాల విదేశాంగ మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. రక్షణ సహా అనేక అంశాలపై ఫ్రాన్స్ ఫారీన్ మినిస్టర్ జీన్ యువెస్ లి డ్రియన్‌తో విస్తృతంగా చర్చించినట్టు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ప్రస్తుత రక్షణ, రాజకీయాంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు వెల్లడించారు. వైమానిక రంగం, కొవిడ్ 19పై పోరులో సహకరించేందుకు ఫ్రాన్స్ అంగీకరించిందని, యూఎన్‌ఎస్‌సీలో బలమైన మద్దతుదారుగా నిలబడినందకు ధన్యవాదాలు తెలిపారు. సమీప భవిష్యత్తులో కలిసి పనిచేసేందుకు యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌కు రక్షణ పరికరాలు, యుద్ధ విమానాలను ఫ్రాన్స్ అందిస్తున్నది. ఈ నెల 27న ఈ దేశం నుంచే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు చైనాతో సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో యుద్ధ విమానాల తరలింపును మరింత తొందరగా పంపించేందుకు అంగీకరించింది.


Next Story