20 మంది కోసం రూ. 20 కోట్ల ఖర్చా.? : మాజీ ఎంపీ వివేక్

by Aamani |
20 మంది కోసం రూ. 20 కోట్ల ఖర్చా.? : మాజీ ఎంపీ వివేక్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో 20 మంది లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చేందుకు హాడావుడి చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకట స్వామి మండిపడ్డారు. రూ. 20 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రేమ ఉంటే అందరికీ ఒకే రోజు దళితబంధు చెక్కులు (రేపే) ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు లబ్ధిదారుల కోసం సర్వే పేరిట కమీషన్లు దోచుకునేందుకు కుట్ర పన్నారన్నారు. హైదరాబాద్‌లో ఇంటింటికీ పదివేలిస్తామన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్లే ఐదు వేలు తీసుకున్నారని ఆరోపించారు.

ఇప్పటికే పేద దళితులకు 2 లక్షలిస్తామని టీఆర్ఎస్ నాయకులను బ్రతిమాలే ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయని, ముఖ్యమంత్రి ఇప్పటికే సమగ్ర సర్వే చేయించారని, ఆ డాటా అంతా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మళ్లీ సర్వేలు ఎందుకు చేయిస్తున్నారని వివేక్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజక్టులో 55 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, 33 వేల కోట్లతో ప్రాణిహిత చేవేళ్ల పూర్తయ్యేదన్నారు. చింతమడకలో ఎలా అయితే ఇంటింటికీ పది లక్షలు ఇచ్చారో హుజురాబద్‌లో కూడా అలాగే ఇవ్వాలని కోరారు.

ఏడేళ్లయినా రాష్ట్రంలో దళితులు ఇంకా దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ వాగ్ధానాలు చేస్తున్న బాల్క సుమన్.. చెన్నూరులో చేసిందేమీ లేదని ఆరోపించారు. అక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు. మూడు ఎకరాల భూములు కూడా ఇవ్వలేదని, రోడ్లు లేవు, ఆస్పత్రులు లేవన్నారు. అలాంటి నాయకులు హుజురాబాద్ వచ్చి ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. మా దగ్గర పనిచేయని కొప్పుల ఈశ్వర్ అక్కడికెళ్లి ఎందుకు హామీలిస్తున్నారని ధర్మపురి ప్రజలు అడుగుతున్నారన్నారు.

వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాల్లో పనులు జరిగాయో లేదో హుజురాబాద్ ప్రజలు నిలదీయాలని వివేక్ పిలుపునిచ్చారు. హుజురాబాద్‌లో 4 లైన్ రోడ్లు, 100 పడకల ఆస్పత్రి, స్కూళ్లు, కాలేజీలు వంటివెన్నో జరిగాయని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఈటల రాజేందర్ కట్టించారన్నారు. బీజేపీ ఈ పథకాన్ని అడ్డుకుంటున్నామని ఓ మంత్రి ఆరోపిస్తున్నారు. మేము ఈ పథకాన్ని అడ్డుకోవడం లేదు. అందరికీ ఇవ్వాలని అడుగుతున్నామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed