కేసీఆర్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా..

by Anukaran |   ( Updated:2020-11-30 12:17:54.0  )
కేసీఆర్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత వివేక్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయనకు లీగల్ నోటీసు పంపారు. నోటీసు అందుకున్న తర్వాత బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు వంద కోట్ల రూపాయల మేర పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సీఎంతో పాటు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు కూడా ఇదే తరహాలో మరో నోటీసు జారీ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నగరంలో స్వాధీనం చేసుకున్న డబ్బుకు తనతో సంబంధం ఉందంటూ నగర పోలీసు కమిషనర్ నవంబరు 1వ తేదీన మీడియా సమావేశంలో తన పేరును ప్రస్తావించారని, తనపైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారని వివేక్ సోమవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు.

నగరంలో స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి చట్టంలోని నిబంధనలకు భిన్నంగా పోలీసు కమిషనర్ వ్యవహరించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి మేరకే ఇలా చేశారని, అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించడమే కాకుండా తనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనర్‌పై ముఖ్యమంత్రి వత్తిడి చేసినందునే తనపై అక్రమంగా క్రిమినల్ కేసును నమోదు చేశారని, నగదుతో తనకు సంబంధం లేకపోయినా తన పేరును, కంపెనీ పేరును ప్రస్తావించి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనర్‌పై వత్తిడి చేసినందుకు ముఖ్యమంత్రికి, తప్పుడు కేసు నమోదు చేసినందుకు నగర పోలీసు కమిషనర్‌పైనా పరువునష్టం దావాను వేయనున్నట్లు లీగల్ నోటీసు ఇచ్చానని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed