కాంగ్రెస్ గూటికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి?

by Anukaran |   ( Updated:2021-06-28 04:02:48.0  )
Konda
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఆ పార్టీని వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్లీ హస్తం గూటికి చేరనున్నారా..? ఇన్నాళ్లు రేవంత్ రెడ్డికి బాసటగా ఉన్న కొండా.. ఆయనకు టీపీసీసీ పదవీ రావడంతో మళ్లీ గాంధీభవన్ మెట్లు ఎక్కనున్నారా..? సీఎం కేసీఆర్‌‌పై పోరుకు కాంగ్రెసే సరైన పార్టీ అనుకుంటున్నారా..? వీటిన్నీటికి అవుననే సమాధానం వస్తోంది. రేవంత్ రాకతో గతంలో వద్దనుకున్న పార్టీతోనే ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత పొకడలతో పాలన కొనసాగిస్తుందని పలుమార్లు బహిరంగాగనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాంగా కాంగ్రెస్ ఉంటుందని భావించిన కొండా టీఆర్ఎస్ పార్టీని వీడి ఆ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి కార్యక్రమానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండి టీఆర్ఎస్ పై పోరాటం చేయడంలో విఫలమైనట్లు కొండా అసంతృప్తి చెందారు. కేసీఆర్ నియంత పాలనపై పోరాటం చేసే వ్యక్తులకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

అయితే ఆ తర్వాత తమ నివాసంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్లో కేసీఆర్, కేటీఆర్ చేసే తప్పులపై పోరాడే వ్యక్తులకు, పార్టీలకు పూర్తిగా మద్దతు తెలుపుతానని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వానికి సైతం సూచనలు చేస్తాము.. ఆ సూచనలు అమలు చేయకుంటే పోరాటమేనని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాటం చేసే వ్యక్తి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారా అనే చర్చ సాగుతోంది.

ఎఫెక్టివ్‌గా పనిచేయకపోవడంతోనే రాజీనామా…

కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నేతలు డబ్బులకు అమ్ముడుపోయి టీఆర్ఎస్‌లో చేరారనే ఆరోపణలు చేశారు. ఉత్తమ్ లాంటి వాళ్లు ఎఫెక్టివ్‌గా ఫైట్ చేయకపోవడంతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని కొండా అన్నారు. కేసీఆర్‌ను చూసి భయపడుతున్నారని అసహానం వ్యక్తం చేశారు. ఏ ఒక్క అంశం మీదనైనా కేసు వేశారా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. పార్టీలపై పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే ఏదైనా పార్టీలో చేరాలా… లేకపోతే స్వతంత్రంగా పోటీ చేయాలా అనే విధంగా కొండా అడుగులు వేశారు. అయితే బీజేపీ చెబుతున్న విధానాలకు చేస్తున్న పనులకు తేడా ఉండటంతో ఆ పార్టీలో చేరేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది.

పీసీసీ మారితే కాంగ్రెస్ గట్టి ఫైట్ చేస్తే మళ్లీ చేరుతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా విలేకర్ల సమావేశంలోనే చెప్పడం విశేషం. అందుకే బీజేపీలో చేరేందుకు మక్కువ చూపలేదని తెలుస్తోంది. వీటన్నీటి నేపథ్యంలో మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed