వైసీపీకి తలనొప్పిగా మారిన ఆనం… ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు

by srinivas |   ( Updated:2021-09-30 07:03:26.0  )
వైసీపీకి తలనొప్పిగా మారిన ఆనం… ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. ముగ్గురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న ఆయన కాంగ్రెస్‌ హయాంలో ఓ వెలుగు వెలిగారు. కీల‌క‌మైన ఆర్థిక శాఖ‌ను నిర్వహించారు. రాష్ట్ర విభ‌జ‌న‌ ప్రభావంతో రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో కూడా సరైన గుర్తింపు దక్కకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో వెంక‌ట‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. ఆయన ఇంకెవరో కాదు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి. తన సీనియారిటీకి జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ కన్ఫమ్ అనుకుని భంగపడ్డారు. తనకన్నా వయసులోనూ..రాజకీయంగానూ అనుభవం తక్కువైన మేక‌పాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్‌ యాదవ్‌లకు సీఎం జగన్ కేబినెట్‌లో చోటు కల్పించారు. దీంతో ఆయన అప్పటి నుంచి కాస్త అసహనంగానే ఉంటున్నారు. ఒక్కోసారి అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ అధికారులపై చురకలంటిస్తూనే ఉన్నారు. దీంతో వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారారు.

ఆదిలోనే వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో రౌడీలూ గుండాలూ ఎక్కువయ్యారు. భూకబ్జాలూ… సెటిల్‌మెంట్లూ పెరిగిపోయాయంటూ బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే వైసీపీ నేతలు సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సైతం ఫిర్యాదు చేయడంతో ఆయన వివరణ కోరారు. అనంతరం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తనతో సహా ఎవరైనా ఒకటేనని, క్రమశిక్షణా చర్యలు తప్పవని జగన్‌ హెచ్చరించారు. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తానంటే సహించబోనని జగన్ స్పష్టం చేశారు. దీంతో ఆనం కాస్త వెనక్కి తగ్గారు.

వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి అవమానాలు ఎదుర్కొంటున్నా..
అంతేకాదు గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతానని హెచ్చరించారు. వేడుకలకు తనను ఆహ్వానించకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట అని మండిపడ్డారు. అధికారులతో తాడోపేడో తేల్చుకుంటానన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సిగ్గుపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదంటూ ఆనం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి.

మారని ఆనం వైఖరి
ఇకపోతే బుధవారం నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆనం రామనారాయణరెడ్డి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పరోక్షంగా ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ఇళ్ల స్థలాలు చదును చేసి అభివృద్ధి చేసినా ఇంకా పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదంటూ మండిపడ్డారు. చివరకు ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకూ పేమెంట్లు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. పనులు చేసిన ఏడాది తర్వాత నాణ్యత పరిశీలించాలంటే ఎలా సాధ్యపడుతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. వెంకటగిరిలో టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచారు..కానీ, ఇంతవరకు ఆ కాంట్రాక్టర్‌ పనులు మొదలుపెట్టలేదని ధ్వజమెత్తారు. చివరకు పేదల ఇళ్ల నిర్మాణాలకూ నెల రోజుల నుంచి బిల్లులు రాలేదన్నారు. బిల్లులు ఇవ్వకపోతే మనపై నమ్మకం పోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వ్యాఖ్యలతో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కాస్త అసహనానికి గురయ్యారు. ఆనం వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉన్నాయంటూ గుసగుసలాడుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed