ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ సంస్కరణలు…

by  |
ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ సంస్కరణలు…
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 10 నుంచి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో చికిత్స పొందుతూనే మరణించారు.

రాష్ట్రపతి హోదాలోనే కాకుండా గతంలో ఆర్థికవేత్తగా కూడా ప్రశంసలు అందుకున్న ఆయన… ఇందిరాగాంధీ హయాంలోనూ, మన్మోహన్ సింగ్ హయాంలోనూ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

ఇందిరా హయాంలో…

ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1982 నుంచి 1984 వరకూ ఆర్థిక మంత్రిగా సేవలందించారు. సరళీకరణ ఆర్థిక విధానాలకు ముందు తర్వాత ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ విధులు నిర్వహించారు. అలాగే, 1982-83 ఆర్థిక సంవత్సరంలో తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదటి సంస్కర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.

దీంతోపాటు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సమయంలో ప్రపంచ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమని మ్యాగజైన్ నివేదికలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1970, 1980 దశాబ్దాల్లో గ్రామీణ బ్యాంకులు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారు.

మన్మోహన్ హయాంలో…

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2009 నుంచి 2012 మధ్య రెండవసారి ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలను చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ, లైసెన్స్ రాజ్ వ్యవస్థకు ముగింపు పలికారు. ఈ మార్పు భారతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందించింది.

అనంతరం 2009లో రెండోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా మూడు సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2012-13 నాటికి జీడీపీలో బడ్జెట్ లోటును 4.1 శాతానికి తగ్గించారు.

ప్రపంచ సంక్షోభం ఉన్న సంవత్సరంలో బడ్జెట్ లోటును తగ్గించడానికి గణనీయమైన చర్యలు తీసుకున్నందుకు 2010లో, లండన్‌కు చెందిన వార్తాపత్రిక ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రణబ్‌కు ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ ఫర్ ఏషియా’ అవార్డును ప్రదానం చేసింది.

సంస్కరణలు…

ప్రణబ్ ముఖర్జీ అనేక సంస్కరణలను చేపట్టారు. కమొడిటీ లావాదేవీలను రద్దు చేశారు. జీఎస్టీని అమలు చేశారు. అలాగే, అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్‌లో వాటాను పెంచారు.

2009-10 బడ్జెట్‌లో కార్పోరేట్ పన్ను రేటును స్థిరంగా ఉంచుతూనే, సీనియర్ సిటిజన్‌లకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 15 వేలు, మహిళలకు రూ. 10 వేలు పెంచాలని ఆయన చేసిన ప్రతిపాదన విశ్లేషకుల నుంచి మంచి స్పందన పొందింది. ఆడపిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం నిధులను పెంచారు. మౌలిక సదుపాయాల కార్యక్రమాలను విస్తృతం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో…

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహా ఇతర అంతర్జాతీయ ఫోరమ్‌లలో సేవలను అందించి ప్రణబ్ ముఖర్జీ దేశం గర్వించేలా చేశారు.

బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా :

– అంతర్జాతీయ ద్రవ్య నిధికి 1982 -1985, 2009-2012 మధ్య ఉన్నారు.
– ప్రపంచ బ్యాంక్‌కు (1982 – 1985), (2009-2012)
– ఆసియా అభివృద్ధి బ్యాంకుకు (1982 – 1985, (2009-2012)
– ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు (1982-1985), (2009-2012)
– ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులోని 24 దేశాల సమూహానికి ఛైర్మన్‌గా – 1984, 2011-12 మధ్య ఉన్నారు.
– సార్క్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్‌కు మే 1995, నవంబర్ 1995, ఏప్రిల్ 2007లలో అధ్యక్షత వహించారు.


Next Story

Most Viewed