‘అది కూడా మారటోరియంతో పాటే జరగాల్సింది’

by Harish |
‘అది కూడా మారటోరియంతో పాటే జరగాల్సింది’
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించిన రుణాల పునర్:వ్యవస్థీకరణ ప్రణాళిక రుణ చెల్లింపులకు మారటోరియం ప్రకటించడంతో పాటే జరిగి ఉండాలని భారత మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ అభిప్రాయపడ్డారు. ‘బ్యాంకులు చేయబోయే రుణాల పునర్వ్యవస్థీకరణ ఇంతకుముందే జరిగి ఉండాలి. మారటోరియం కొనసాగుతున్నప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభమై ఉండాల్సింది. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం అవసరం, రాత్రికి రాత్రి లేదా నిర్దిష్ట పరిమితికి మించి చేయలేము. దీనికి సంబంధించిన అంశాలు బోర్డు ఆమోదం కోసం వెళ్లాలని, దీనికి సమయం పడుతుందని’ ప్రణబ్ సేన్ వివరించారు. ఈ ప్రక్రియ కోసం మూడు నెలల కన్నా ఎక్కువ సమయం పడితే, దానివల్ల అనేక కంపెనీలను నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)గా ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ముందే పునర్:వ్యవస్థీకరణ ప్రారంభిస్తే మారటోరియం ముగిసే సమయానికి అలాంటి కంపెనీలు మనుగడ సాగించేవని ఆయన తెలిపారు.

మారటోరియం ఎక్కువ కాలం అక్కరలేదు…

ఇదే సమయంలో, రెండేళ్ల మారటోరియం వల్ల ప్రయోజనాలుండవని ప్రణబ్ సేన్ స్పష్టం చేశారు. ఎక్కువ కాలం మారటోరియం ఇవ్వడంతో వెసులుబాటును పొందే సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి బ్యాంకులకు తెలియకుండానే అవి కనుమరుగయ్యే ప్రమాదముంది. అంత సమయం మారటోరియం ఉంటే గనక, బ్యాంకులు ఖచ్చితంగా సదరు కంపెనీల సమాచారాన్ని పొందలేవు. ఏ కంపెనీ కనుమరుగయ్యిందో, ఏ కంపెనీలు ఎన్‌పీఏలుగా మారాయో బ్యాంకులకు స్పష్టత రావడం కష్టమవుతుంది. ఇది బ్యాంకులకు తీవ్రమైన సమాచార అంతరాన్ని కలిగిస్తుంది. బ్యాంకుల నిర్ణయాత్మక సామర్థ్యం తుడిచిపెట్టుకుపోతుందని ప్రణబ్ సేన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed