చరిత్రలో ఇదే తొలిసారి.. తగ్గుతున్న ప్రపంచ జనాభా ! 

by Shyam |
papulation
X

దిశ, ఫీచర్స్ : శతాబ్దాల చరిత్రను పరిశీలిస్తే.. ప్రపంచ జనాభా పెరగడమే తప్ప తగ్గడాన్ని చూసి ఉండరు. కానీ తొలిసారిగా వచ్చే శతాబ్ద కాలంలో ప్రపంచ జనాభా తగ్గిపోనుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం వరల్డ్ పాపులేషన్ 7.8 బిలియన్‌ ఉండగా.. 2064 నాటికి 9.7 బిలియన్‌ గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత 2100లోగా 8.79 బిలియన్‌కు తగ్గుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది.

తక్కువ జనన రేట్లు, వృద్ధ జనాభా కారణంగా జపాన్, థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ కొరియా తదితర 23 దేశాల్లో జనాభా 50 శాతానికి పైగా తగ్గిపోయే అవకాశం ఉంది. అత్యధిక పాపులేషన్ కలిగిన చైనాలో 2017లో 1.4 బిలియన్‌గా ఉన్న జనాభా 2100 నాటికి 732 మిలియన్‌కు పడిపోతుందని అంచనా. జనాభా క్షీణతలో ప్రపంచ ధోరణిని గమనిస్తుంటే.. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, సబ్-సహారా ఆఫ్రికాలో మాత్రం జనాభా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా దేశమైన భారత్‌లో పాపులేషన్ 2100 నాటికి 1.09 బిలియన్‌కు చేరుకుంటుందని పరిశోధన పేర్కొంది. కాగా ‘ప్లేగు వ్యాధి కారణంగా చివరిసారిగా 14వ శతాబ్దం మధ్యలో ప్రపంచ జనాభా క్షీణించింది. కాగా సంతానోత్పత్తి క్షీణత ద్వారా జనాభా తగ్గుతుండటం ఇదే మొదటిసారి’ అని అధ్యయన రచయిత పేర్కొన్నారు.

బాలికలకు విద్య, గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉండటం వల్ల సంతానోత్పత్తి, జనాభా పెరుగుదల మందగించవచ్చని అధ్యయనం పేర్కొంది. జనాభాను నిర్ణయించడంలో ఒక స్త్రీ తన జీవితకాలంలో ప్రసవించే సగటు పిల్లల సంఖ్యది కీలక పాత్ర. సంతానోత్పత్తి రేటును ఈ కారకాలే ప్రభావితం చేస్తాయి. కాగా జనాభా సంఖ్యను నిర్వహించడానికి అవసరమైన కనీస రేటు(ఒక మహిళకు 2.1 సజీవ జననాలు) కంటే చాలా తక్కువగా ఉందని రచయిత తెలిపారు. ఈ మేరకు ప్రపంచం మొత్తంలో 2017లో 2.37గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2100 వరకు క్రమంగా 1.66 వరకు తగ్గుతుందని అంచనా వేశారు.

Advertisement

Next Story