ఈదేవి, పాకేవి తినడం లేదు..ఆహారంలో పెద్ద మార్పే!

by srinivas |   ( Updated:2020-03-17 02:38:00.0  )
ఈదేవి, పాకేవి తినడం లేదు..ఆహారంలో పెద్ద మార్పే!
X

నిన్న మొన్నటి వరకు ముక్క ఉంటే కానీ ముద్ద దిగేది కాదు. కోడికి కోడి ఆహారంలో భాగం కావాల్సిందే.. పండగలు, పబ్బాల సమయంలో అయితే వేటలు తెగాల్సిందే.. మరి నేడో.. మాంసాహారమంటేనే భయపడిపోతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో కోళ్ల మాస్ కిల్లింగ్ వీడియోలు మరింత భయపెడుతున్నాయి. దీంతో మాంసాహారం జోలికి వెళ్లడం మానేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వాసులు మాంసాహార ప్రియులు. భోజనంలో మాంసం లేదా చేపలు ఉండాల్సిందే. ఉభయగోదావరి జిల్లాల్లో పొలస చేపలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ చేపలు, రొయ్యల చెరువులు కూడా అధికమే… ఇక సముద్ర ప్రాంతాలైన వైజాగ్, కాకినాడల్లో చేపలు, రొయ్యలంటే చెవులు కోసుకుంటారు. కాకినాడలో పీతలు స్పెషల్.. ఇప్పుడు వాటి జోలికి వెళ్లేవారు కరవయ్యారు. కరోనా వైరస్ మాంసాహార ప్రియుల ఆహారపుటలవాట్లలో పెను మార్పులు తీసుకొచ్చింది.

కోళ్లు, చేపలు, రొయ్యలంటే హడలిపోతున్నారు. కూరగాయలు తినేందుకే మక్కువ చూపుతున్నారు. దీనికి కారణమేంటంటే.. చైనాలోని వూహాన్‌లో మాంసాహారం వల్లే కరోనా ప్రబలిందన్న వదంతులు. తెలంగాణలో చికెన్‌తో కరోనా రాదని చెబుతూ మంత్రి కేటీఆర్ చికెన్ లాలీ పాప్‌ని స్వయంగా తిని చూపించారు. మంత్రులు, సమావేశాల సమయంలో సీఎం కూడా కోడి కూరతో భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తిన్నప్పటికీ కోడి బలపడలేదు. రోజు రోజుకీ బలహీన పడి అక్కడక్కడ 30 రూపాలకే కేజీ అమ్ముడు పోయింది. దీంతో కోళ్ల రైతులు దిగాలు పడిపోయారు.

ఇప్పుడీ బాధ చేపల రైతులను తాకింది. చేపలు, రొయ్యలు తినేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వాటికి డిమాండ్ పడిపోయింది. పంట చేతికొచ్చిన రైతులు గిట్టుబాటు ధర రావడం లేదని వాపోతున్నారు. వాటి మేతకయ్యే ధర కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏపీ మత్స్యశాఖ కమిషనర్ జి.సోమశేఖరం రంగంలోకి చేపలు, రొయ్యల వల్ల కరోనా వ్యాపిస్తుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవని, ఆందోళన చెందకుండా తినవచ్చని ప్రకటన విడుదల చేశారు.

కరోనాని నిరోధించాలంటే వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఆయన సూచించారు. మాంసాహారం వల్ల కరోనా వ్యాపిస్తుందనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని, భారత ఆహార పరిరక్షణ, ప్రమాణాల సంస్థ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు తెలిపాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు.

Tags: food habits, mutton, fish, prawns, chicken, non veg food, veg food, health, carona virus

Advertisement

Next Story