దేవినేని ఉమాపై అక్రమ కేసులు పెట్టడం దారుణం: చంద్రబాబు

by srinivas |   ( Updated:2023-12-16 16:37:41.0  )
TDP Politburo Meeting
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమాపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా..తిరిగి ఆయనపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉమాపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాడి ఘటనను అంతా చూశారని తెలిపారు. అయితే ఎస్సీలపై దాడి చేశారని తప్పుడు కేసులు పెట్టించారని మండిపడ్డారు.

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఈ విషయం క్లియర్‌గా కనిపిస్తుందన్నారు. చివరకు కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారని ఆరోపించారు. గ్రీన్ ట్రైబ్యునల్ కూడా అక్రమ మైనింగ్ జరుగుతోందని స్పష్టం చేసిందని చంద్రబాబు చెప్పారు. అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లి వస్తున్న ఉమాపై వైసీపీ గూండాలు దాడి చేశారని ధ్వజమెత్తారు. సుమారు 9గంటలపాటు ఉమా కారులోనే ఉన్నారని అలాంటి వ్యక్తి ఇతరులపై ఎలా దాడికి పాల్పడతారని నిలదీశారు. దేశంలోనే అత్యున్నత పోలీసులుగా పేరుగాంచిన ఏపీ పోలీసులు… చేజేతులా వారికివారే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తన రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకాలను చూడలేదన్నారు. డీజీపీ, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజల్లో ధైర్యం నింపేలా వ్యవహరించాలే తప్ప అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. పాలన చేతకాని జగన్… రాష్ట్రమంతా పులివెందుల పంచాయతీ తీసుకొస్తారని తాను ఎప్పుడో చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని..తమకూ సమయం వస్తుందని అప్పుడు అన్నింటికీ బదులు తీరుస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed