- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెండింగ్ దరఖాస్తులకే వరద సాయం
దిశ, తెలంగాణ బ్యూరో: వరద ముంపు బాధితుల గుర్తింపును ఈ నెల 7 నుంచి చేపడుతామని, బాధితులకు తక్షణ సాయమందించే కార్యక్రమం ఆగిపోదని ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజులు గడిచినా ఇప్పటికీ ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా కొత్తగా గుర్తించలేదు. వరద సాయంపై విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటన చేయాల్సి వచ్చింది. మీసేవా కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తుల్లోనూ రెండు లక్షలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇక కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంపై ఎలాంటి మార్గనిర్దేశకాలు లేకుండానే బల్దియా ఉన్నతాధికారులు ప్రకటనలకు దిగుతుండటం గమనార్హం.. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వరద సాయాన్ని అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ నెల 7 నుంచి ఈ కార్యక్రమం తిరిగి కొనసాగుతుందని తెలిపారు.
అయితే అనుకున్న రోజు రానే వచ్చింది.. మీసేవా కేంద్రాల ముందు జనాలు బారులు తీరారు. స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ల ఇండ్లకు బాధితులు వెళ్లారు. నిజమైన బాధితులకు ఇవ్వకుండా ఎవరికెవరికో డబ్బులు ఇచ్చారంటూ ఆవేదన చెందారు. సర్కిల్ కార్యాలయాల వద్దకు బాధితులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు చేరుకుని అధికారులు నిలదీశారు. ఊహించని పరిణామంతో ప్రభుత్వం స్పందించి జీహెచ్ఎంసీతో ప్రకటన చేయించాల్సి వచ్చింది. వరద ముంపు ఏరియాల్లో జీహెచ్ఎంసీ అధికారులు పర్యటించి, సాయాన్ని అందిస్తారని ప్రకటించారు. ఇప్పటికీ ఏ అధికారులు ఎవరి ఇంటి వద్దకు వెళ్లలేదు. కనీసం మీసేవా కేంద్రాల ద్వారానైనా దరఖాస్తులు తీసుకుంటారని తిరుగుతున్నా వారికి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మూడు రోజులైనా వరద ముంపు బాధితులను గుర్తించే కార్యక్రమం మొదలు కాలేదని, సాయం కోసం బాధితులు ఎదురుచూస్తుండటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో వారు స్పందించక తప్పలేదు. గత సోమవారం నుంచే బాధితుల గుర్తింపు నిర్వాహించాల్సి ఉన్నప్పటికీ జరగలేదు. మూడు రోజులుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు రాలేదని చెబుతూ వచ్చిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు బుధవారం మాటమార్చారు.
2లక్షల దరఖాస్తులు పెండింగ్ లో..
ఆదేశాలు గురించి చెప్పకపోయినా.. వరద సాయం కార్యక్రమం ఆగిపోదని ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రి ఆదేశాలతోనే జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించక తప్పలేదని సమాచారం. వరద సాయం కార్యక్రమం ఆగిపోదని, మంగళవారం రోజు 17, 333 మందికి బ్యాంకు ద్వారా సాయాన్ని అందించినట్టు కమిషనర్ ప్రకటించారు. అయితే ఈ నెల ఏడో తేదీ నుంచి కొత్తగా ఎంతమందిని గుర్తించి, ఎందరికి సాయమందించారో ఆయన చెప్పలేకపోయారు. జీహెచ్ఎంసీ ప్రకటనల ప్రకారం 8,9 తేదీల్లో కలిపి 17,333 మందికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడో తేదీన బాధితుల గుర్తింపు జరగలేదు. డబ్బులు జమా చేయలేదని చెప్పకనే చెప్పింది. అధికారులు చెబుతున్నది కూడా అంతకుముందు మీసేవాల ద్వారా అందిన దరఖాస్తుల్లోని లబ్ధిదారులే గానీ.. ఎన్నికల తర్వాత కొత్తగా గుర్తించిన వారు ఒక్కరూ లేరు. ఇంటింటికీ వెళ్లి నేరుగా అందించిన వరద సాయం కాక మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా రెండు రోజుల పాటు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు అందించారు. ఇంకా రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు మీసేవా రాష్ట్ర కార్యాలయం చెబుతోంది. ఇందులో నుంచి 17 వేల మంది కోసం రూ.17.33 కోట్లను ఈ రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమా చేశారు. మీసేవాల ద్వారా దరఖాస్తులు ప్రారంభించినపుడు రోజుకు రూ.55 కోట్ల చొప్పున జమా చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు రెండు లక్షల పెండింగ్ దరఖాస్తులున్నా.. రోజుకు రూ.9 కోట్లకు మించకుండా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తుండటం గమనార్హం..
క్షేత్రస్థాయి పర్యటన ఏది..?
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకే ఇప్పుడు వరద సాయం జమా చేస్తుండగా.. కొత్త దరఖాస్తులను ఎప్పటి నుంచి తీసుకుంటారని, లబ్ధిదారుల గుర్తింపును ఎప్పుడు చేపడుతారనేది బల్దియా అధికారులకే స్పష్టత లేదు. వరద బాధితులకు అందించే నిధులు ఎంఏయూడీ ఇస్తోందని, ఈ విషయంలో తమకు సంబంధం లేదని చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటనలు చేసేందుకు మాత్రం ముందుకు వస్తున్నారు. వరద సాయం అందించే కార్యక్రమం ఆగిపోదని జీహెచ్ఎంసీ ప్రకటించినప్పటికీ కొత్త అప్లికేషన్లు తీసుకోవడం లేదు. వరద సాయంపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్‌ను రంగంలోకి దించినట్టు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను గుర్తిస్తామని ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకూ ఎవరూ వెళ్లడం లేదు. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు చెబుతున్నారు. మార్గనిర్దేశకాలు వెలువడలేదని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా తాము ఎక్కడికి వెళ్లగలమని వారు తెలిపారు. అధికారులు ఎప్పుడు వస్తారంటూ మరో వైపు ముంపు బాధితులు ఎదురుచూస్తున్నారు. గతంలోనూ వరద సాయం పంపిణీ చేపట్టినపుడు తమకు న్యాయం జరగలేదని, నష్టం జరగనివారికే పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 7 నుంచి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో అటు అధికారులు, ఇటు బాధితులు ఎదురుచూపులతో గడుపుతున్నారు.