మిడతల నియంత్రణకు బైలెల్లిన అధికారుల దండు

by  |
మిడతల నియంత్రణకు బైలెల్లిన అధికారుల దండు
X

దిశ, కరీంనగర్: దేశం ఓ పక్క కరోనా మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరో పక్క మిడతల దండు వచ్చి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించడంతో, వీటిని నియంత్రించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీ రంగంలోకి దిగింది. మిడతల ప్రయాణం ఎక్కడి వరకు చేరింది? అవి ఎటు వైపుగా వస్తున్నాయి? వస్తున్నప్పుడు పంటలను ఎలా నాశనం చేశాయి? రాష్ట్రంలోకి ప్రవేశించిన వెంటనే వాటిని కట్టడి చేయడం ఎలా అన్న విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫైవ్‌ మెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తోంది. రామగుండం ఎన్టీపీసీ జ్యోతి గెస్ట్ హౌజ్‌లో ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం అయ్యి మిడతలను కట్టడి చేసేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ కమిటీలో సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి సునీత, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్, సైంటిస్ట్ రహమాన్, వరంగల్ అటవీ అధికారి అక్బర్, రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలిక్కేరీలు ఉన్నారు. హెలికాప్టర్‌లో అదిలాబాద్ జిల్లాలోని తుమ్మడిహట్టి నుంచి భద్రాచలం వరకూ గోదావరి తీరంలో పరిస్థితిని పర్యవేక్షించనున్న ఈ కమిటీ నాలుగు రోజుల పాటు రామగుండంలోనే ఉండనుంది. ప్రాణహిత పరివాహక ప్రాంతానికి కొద్ది దూరానికి చేరుకున్న ఈ మిడతలు ఏ క్షణంలో అయినా తెలంగాణాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన ప్రభుత్వం ప్రత్యక్ష్య చర్యలు తీసుకునే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది.


Next Story

Most Viewed