ఐసీయూలో పేషెంట్లు.. హఠాత్తుగా అగ్నిప్రమాదం

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్‌తో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న బాధితులను ఫైర్ అక్సిడెంట్ గజగజలాడించింది. వెంటిలేటర్ మీద ఉన్న కరోనా బాధితులు మంటలు వ్యాపించినా.. నిస్సహాయ స్థితిలో ఉండటం బాధాకరం. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లను దగ్గరుండి బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లో కలకలం రేపగా.. సోషల్ మీడియాలో సంబంధిత వీడియో వైరల్‌గా మారింది.

గుజరాత్‌‌లోని వడోదర జిల్లా సాయాజీ హాస్పిటల్‌‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్‌లోని కొవిడ్ ఐసీయూ వార్డులో ఐదుగురు బాధితులు వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నారు. ఒక్కసారిగా ఆక్సిజన్, పల్స్‌ చెక్ చేసే మిషిన్‌లో నుంచి పొగలు వచ్చాయి. అవి అంతటితో ఆగక ఒక్క సారిగా మంటలు కూడా చెలరేగాయి.

దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న పేషెంట్లు అక్కడి నుంచి తప్పించుకోవడం గగనం అయింది. వెంటనే అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. ఓ వైపు మంటలు వ్యాపిస్తున్నా.. పారిపోకుండా పేషెంట్ల ప్రాణాలను కాపాడడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఐసీయూ వార్డులో ఫైర్ ఆక్సిడెంట్ కావడం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Advertisement