కష్టాల్లో క్రికెట్ సౌతాఫ్రికా

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి క్రికెట్ బోర్డుల ఆదాయానికి భారీగానే గండి కొడుతున్నది. ఇప్పటికే వెస్టిండీస్, శ్రీలంక వంటి క్రికెట్ బోర్డులు భారీగా ఆదాయాన్ని కోల్పోగా, ఇప్పుడు అదే దారిలో క్రికెట్ దక్షిణాఫ్రికా కూడా పయనిస్తున్నది. ఈ ఏడాది నవంబర్ వరకు దక్షిణాప్రికా క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని, వెస్టిండీస్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను కూడా వాయిదా వేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ శనివారం వెల్లడించారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులోని కీలక క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడటానికే మొగ్గు చూపించడంతో వెస్టిండీస్ సిరీస్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చినట్లు స్మిత్ చెప్పారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత దక్షిణాప్రికా జట్టు తిరిగి అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధపడే అవకాశం ఉన్నట్లు స్మిత్ వెల్లడించారు. ఇప్పటికే ఇండియాతో జరగాల్సిన సిరీస్, వెస్టిండీస్ సిరీస్ రద్దు కావడంతో క్రికెట్ సౌతాఫ్రికాకు ఆదాయానికి భారీగా గండి పడింది. ఇటీవల నిర్వహించిన 3టీ క్రికెట్ ద్వారా కూడా ఆదాయం రాకపోవడం సీఎస్ఏను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. నవంబర్ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే కాని తిరిగి బోర్డు ఖజానా నిండే అవకాశాలు లేవు.

Advertisement