అతిజాగ్రత్తలు.. కారాదు అడ్డంకులు !

by  |
అతిజాగ్రత్తలు.. కారాదు అడ్డంకులు !
X

దిశ, మహబూబ్ నగర్ : కరోనా నియంత్రణ కోసం పలు గ్రామాల్లో చేపడుతున్న చర్యలు బాగానే ఉన్నా.. కొన్ని చోట్ల వారు తీసుకుంటున్న అతి జాగ్రత్తలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా వరకు గ్రామాల్లోకి ఇతర ప్రాంతాల వారెవరూ రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల ముఖద్వారాల వద్ద ముళ్ళ కంచెలు వేయడంతో పాటు పాత వాహనాలు, ఇతరత్రా వస్తువులను రోడ్డుకు అడ్డంగా పెడుతున్నారు. ఎవరైనా వాటిని తొలగించాలని చూస్తే, గ్రామస్తులు వారితో వాగ్వివాదానికి దిగుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లోనూ గ్రామాల్లోకి వెళ్ళేందుకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఏదైనా రోడ్డు మార్గంలో ఒక్క గ్రామం వారు తీసుకున్న నిర్ణయంతో.. ఆ గ్రామానికి అనుసంధానంగా ఉన్న ఇతర గ్రామాల వారు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రామాలకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, ఇతర వాహనాలు, అధికారులు వెళ్లాలన్నా.. ఇబ్బందులు తప్పడం లేదు. అంబులెన్సులు నిలిచిపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయని అంబెలెన్సుల డ్రైవర్లు వాపోతున్నారు. ముళ్ళపొదలను తొలగించుకుంటూ వెళ్లాలంటే సమయం వృథా అవుతుండటంతో సరైన సమయానికి వైద్యం అందించలేకపోతున్నారు. అలాగే వైద్య సిబ్బంది సైతం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు వైద్య సేవలందించేందుకు వెళ్లడానికీ అవస్థలు పడాల్సి వస్తోంది.

కరోనా నేపథ్యంలో గ్రామస్తులు తీసుకుంటున్న చొరవ మంచిదే అయినా, ముళ్ళ కంచెలు వేసిన చోట షిఫ్టుల వారిగా యువకులు కాపలాగా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగైతే అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

Tags : Lock down, Corona, villages self quarantine, health emergency, fencing



Next Story

Most Viewed