26% క్షీణించిన ఫెడరల్ బ్యాంక్ త్రైమాసిక లాభం

by Harish |
26% క్షీణించిన ఫెడరల్ బ్యాంక్ త్రైమాసిక లాభం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-29 మహమ్మారి కారణంగా ఏర్పడే ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కోవడానికి నిబంధనలను పెంచడంతో దేశీయ ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంకు సెప్టెంబర్ త్రైమాసిక లాభంలో 26 శాతం పడిపోయింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ. 307 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 417 కోట్లను నమోదు చేసింది. కేటాయింపుల మొత్తం గతేడాది రూ. 252 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఏకంగా 50 శాతంపైగా పెరిగి రూ. 592 కోట్లకు చేరుకున్నాయన్ని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం బ్యాంకు రుణాలలో 10 శాతాన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్టు ఫెడరల్ బ్యాంక్ సీఈఓ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. ‘బ్యాంక్ లోన్‌బుక్‌లో 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఆర్‌బీఐ నిర్దేశించిన నిబంధనలతో పునర్నిర్మించాలని ఆశిస్తున్నాం. అంటే, ఈ త్రైమాసికంలో తాము రూ. 26 కోట్ల విలువైన రుణాలను పునర్నిర్మించాం. మరో రూ. 360 కోట్ల రుణాలను పునర్నిర్మించాలని ఆర్‌బీఐని అభ్యర్థించామని శ్రీనివాసన్ పేర్కొన్నారు.

ఆర్‌బీఐ మారటోరియం నిర్ణయం కారణంగా ప్రస్తుతం రూ. 3 కోట్ల విలువైన రుణాలు మాత్రమే ఎన్‌పీఏలుగా మారాయి. మారటోరియం వెసులుబాటు లేకపోయి ఉంటే సుమారు రూ. 237 కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారేవని శ్రీనివాసన్ వివరించారు. మారటోరియం కారణంగా బ్యాంకు స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి మొత్తం రుణాల్లో 2.84 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ నాటికి బ్యాంకు మొత్తం లోన్‌బుక్ రూ. 1.22 లక్షల కోట్లని, ఇందులో 2.5 శాతం నుంచి 3 శాతం అంటే సుమారు రూ. 3,500 కోట్లు పునర్నిర్మించబడతాయి. ఇందులో రూ. వెయ్యి కోట్లు కార్పొరేట్ రుణాలని శ్రీనివాసన్ చెప్పారు.

Advertisement

Next Story