‘ధరణి’తో కొత్త చిక్కులు..

by Anukaran |   ( Updated:2020-09-10 20:15:31.0  )
‘ధరణి’తో కొత్త చిక్కులు..
X

దిశ, న్యూస్ బ్యూరో: మీ పేరు ‘ధరణి’లో ఉందా? ఉంటే సరి.. మీ పేరు లేదా? మీ భూమి తక్కువ పడిందా? అయితే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. కొత్త రెవెన్యూ చట్టం ఇదే స్పష్టం చేస్తోంది. ధరణిలో ఇప్పటి దాకా నమోదైన 1 బి రికార్డు హోల్డర్లకు ఎలాంటి ఇబ్బది లేదు. సత్వర సేవలు లభిస్తాయి. వివాదాల మూలంగా, ప్రభుత్వ ఇరకాటం కారణంగా వివరాలు డిజిటలైజేషన్ కు నోచుకోని ఖాతాలపైనే పెద్ద పేచీ పడింది. మూడేండ్లుగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో వివిదాల సుడిగుండంలో చిక్కినవారికి మాత్రం చుక్కలు కనబడేటట్లుంది. ప్రధానంగా పార్టు బి లో పేర్కొన్న హక్కుదారుల విషయంలో కొత్త చట్టం ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపలేదు. వారంతా సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందేనన్న అర్ధాన్ని స్ఫూరిస్తుంది.

పార్టు బి వివాదాలు చాలా వరకు ‘ధరణి’ ద్వారా తలెత్తినవేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఖాస్రా, చెస్లా రిజిస్టర్ ఆధారంగా సర్వే నంబర్లను నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వ భూములుగా ఉన్నవన్నీ నేటికీ యథాతథంగానే ఉన్నట్లు క్రోఢీకరించడం ద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యారు. అప్పటి నుంచి అనేక అసైన్మెంట్లు, కేటాయింపులు చోటు చేసుకున్నాయి. వారికి ఎన్వోసీలు ఇవ్వడం ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు సాగాయి. ఆ తర్వాత పట్టా భూములుగా మారాయి. వాటిని ఇప్పుడు ‘ధరణి’ ద్వారా ప్రభుత్వ భూములుగా పేర్కొనడంతో పాస్ పుస్తకాల జారీ ఆగింది. వాటన్నింటినీ ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్(పీఓబీ) లో చేర్చారు. దాంతో ఎన్నో దశాబ్దాలుగా సాగు చేస్తోన్న వారి ఖాతాలను కూడా పార్టు బి లో చేర్చారు. ఇనాం, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములపైనా కొత్త చట్టంలో స్పష్టత లభించలేదని ఓ డిప్యూటీ కలెక్టర్ ‘దిశ’కు వివరించారు. అప్పటికప్పుడే మ్యుటేషన్ ద్వారా తదుపరి తలెత్తే వివాదాల పరిష్కారానికి మార్గం సుదూరంగా ఉందన్నారు.

అన్ని సర్వే నంబర్లు పీఓబీలోనే..

రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ, వక్ఫ్ భూములు, భూదాన్ భూముల్లో అనేక వివాదాలు ముసిరాయి. వేలాది మంది రైతులకు నేటికీ పాస్ పుస్తకాలు రాలేదు. వాళ్లెవరూ అమ్ముకోవడానికి వీల్లేకుండా వారి భూములన్నింటినీ పీఓబీ జాబితాలో చేర్చారు. ఉదాహరణకు ఓ ఊరిలోని ఒక సర్వే నంబరులో 100 ఎకరాలు ఉండగా, దాంట్లో 20 ఎకరాలు మాత్రమే దేవాదాయ, భూదాన్, వక్ఫ్ భూమిగా ఉంది. ఆ 20 ఎకరాలకు హద్దులు లేవు. దాంతో సదరు సర్వే నంబరు మొత్తాన్ని పీఓబీ జాబితాలో పేర్కొన్నారు. మిగతా 80 ఎకరాల పట్టాదారులు కూడా పాస్ పుస్తకాలకు నోచుకోలేదు. రైతుబంధు, రైతు బీమాలకు కూడా నోచుకోవడం లేదు. ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ భూములనే పార్టు బి లో చేర్చారు. రైతులందరికీ రెవెన్యూ అధికారులంతా అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని ఓ ఆర్డీఓ అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ చట్టంలోనూ వీటిపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. పరిష్కార మార్గాన్ని ఎక్కడా చూపలేదని విమర్శించారు.

అసైన్డ్ భూములమ్మేశారు..

1960 ప్రాంతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములను అనేక మంది అమ్మేశారు. ఇప్పుడా సర్వే నంబర్లన్నింటినీ సర్కారీవిగా ధరణిలో పేర్కొన్నారు. సర్వే నంబరులోని విస్తీర్ణం కంటే అధికంగా భూ పంపిణీ చేశారు. దాంతో పాస్ పుస్తకాల మొత్తం విస్తీర్ణానికి తేడా వచ్చింది. ఇప్పుడలాంటి పట్టాదారులకు పాస్ పుస్తకాలు జారీ చేయ లేదు. కొన్ని పట్టా భూముల సర్వే నంబర్ల విస్తీర్ణాల్లోనూ తేడాలొచ్చాయి. ఇప్పుడలాంటి వారు క్రయ విక్రయాలకు పాల్పడితే రికార్డుల పరంగా కొనుగోలుదార్లకు హక్కులు లభిస్తాయి. క్షేత్ర స్థాయిలో భూములు ఉండని దుస్థితి నెలకొంటుంది. ఎలాగూ ధరణి రికార్డులతోనూ రుణాలు తీసుకోవచ్చు. కనుక దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఆర్డీఓ వివరించారు. విస్తీర్ణాలు సరి చేయకుండానే యథాతథంగా ధరణి ఆధారిత రెవెన్యూ పాలన ద్వారా సామాన్యులకు సమస్యలు తలెత్తనుందన్నారు.

చట్టం అమలుకు 11 మార్పులు..

కొత్త చట్టంపై అనేక అనుమానాలు ఉన్నాయని, చట్టాన్ని యథాతథంగా అమలు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు తక్కువేనని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొ.ఎం.సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. పూర్తిగా ధరణిని విశ్వసించడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. చట్టం మరింత పటిష్టం కావడానికి, మేలైన రెవెన్యూ పాలన కోసం 11 సూచనలు చేశారు. ధరణియే ఆర్వోఆర్ రికార్డు అంటున్నారు. చేర్పులు మార్పులకు రెండేండ్లయినా ఇవ్వాలి. ఆర్వోఆర్ హక్కులను రికార్డు చేసేది సేల్ డీడ్, వారసత్వం, కోర్టు డిక్రీ హక్కుల రికార్డులను పేర్కొన్నారు. అన్ సెటిల్డ్, పీటీ, ఓఆర్సీ, సాదాబైనామా వంటివి పేర్కొనలేదు. కొత్త కేసులు, నంబరు కాని రెవెన్యూ కేసుల సంగతి తేల్చలేదు. గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఆర్ పరిస్థితి ఏమిటి? గవర్నర్ చేయాలి. ఇప్పటికే ఆమోదం పొందారా? రెవెన్యూ కోర్టులు లేవన్నారు. తాత్కాలిక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పీఓటీ.. ఇతర అనేక రకాల కేసులకు మార్గమేది? పేదలకు న్యాయ సలహాలు అందించేందుకు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు వెళ్లేందుకు వారికి సాయం అందించేందుకు ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేస్తారా?

టైటిల్ గ్యారంటీ వాద్వా నివేదిక..

కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన కోసం సీఎం కేసీఆర్, ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, బృందం అవిరళ కృషి చేశారు. డీసీ వాద్వా రిపోర్టును కూడా అధ్యయనం చేసినట్లు తెలిసింది. ప్రతి పట్టాదారుడికి న్యాయం జరిగేందుకు, పేదలందరికీ హక్కులు భద్రం చేసేందుకు ఆయన అనేక సూచనలు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. 1989లో మన్మోహన్ సింగ్ ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఉన్న కాలంలో భూమి హక్కుల చట్టాలను రూపొందించేందుకు డీసీ వాద్వా వన్ మెన్ కమిటీని నియమించారు. అందులో ప్రధానమైనది ‘టైటిల్ గ్యారంటీ’. మన్మోహన్ సింగ్ ప్రధాని అయిన తర్వాత ముసాయిదా చట్టాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలని పంపారు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే దాన్ని అమలు చేశాయి. చాలా రాష్ట్రాలు మాత్రం నేటికీ తెలంగాణ మాదిరిగానే టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలు చేసేందుకు జాప్యం చేస్తున్నాయి. దాంతో డీసీ వాద్వా ‘ఐ అక్యూజ్డ్’ అంటూ భారత పౌరుల భూ హక్కుల పరిరక్షణలో ఫెయిలైన వారిని నిందితులుగా పేర్కొంటూ ఓ పుస్తకాన్ని రాశారు. దాన్ని కూడా మూడింట రెండొంతల వరకు రాసి చనిపోయారు. ఆయన పేదల భూముల హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే అనేక సూచనలు చేస్తూ రిపోర్టు ఇచ్చారు.

Advertisement

Next Story