‘జీలుగ’ గోస.. రాత్రి 12 నుంచి క్యూ కట్టిన రైతులు

by Shyam |
‘జీలుగ’ గోస.. రాత్రి 12 నుంచి క్యూ కట్టిన రైతులు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ మార్కెట్ యార్డులో జీలుగు, పెద్ద జనుము విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. అర్ధరాత్రి 12 గంటల నుంచే రైతులు మార్కెట్ యార్డుకు చేరుకుని క్యూ కట్టారు. ఉదయం ఆరు గంటల వరకు సుమారు వెయ్యి మంది రైతులతో.. కిలోమీటర్ మేర క్యూ కనిపించింది. కామారెడ్డి మండలంలోని 23 గ్రామాలకు కలిపి సొసైటీకి జీలుగు 333, పెద్ద జనుము 375 బస్తాల విత్తనాలు చేరుకున్నాయి.

30 కిలోల జీలుగు బస్తా.. సబ్సిడీ పోగా 561 రూపాయలు, పెద్ద జనుము 929 రూపాయలకు రైతులకు అందజేస్తున్నారు. ఒక్కొక్క రైతుకు కేవలం ఒక బస్తా విత్తనాలు మాత్రమే ఇస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు సరిపోవని, మరో రెండు లారీల బస్తాలు వస్తే రైతులకు కొంత వరకైనా ఇబ్బందులు తప్పుతాయని రైతులు తెలిపారు.

అయితే కేవలం ఒక్కరోజు మాత్రమే విత్తనాల సరఫరా జరగనుండటంతో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుకు చేరుకుంటున్నారు. విత్తనాల కోసం రైతులు భారీగా తరలి వస్తుండటంతో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు మాత్రం బందోబస్తు మధ్య విత్తనాల పంపిణీ జరిగేలా చూస్తున్నారు.

Advertisement

Next Story