పురుగుల మందు డబ్బాతో నిరసన..!

దిశ వెబ్‎డెస్క్: ఎన్నో ఏళ్ల నుంచి భూమి సాగు చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు వేరేవారికి భూమి పట్టా చేశారని ఆరోపిస్తూ పలువురు రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్‎లో తహశీల్దార్ కార్యాలయం ఎదుట 40 మంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. నలభై ఏళ్ల నుంచి ఇటిక్యాలపల్లి రెవెన్యూ పరిధిలో భూములు సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. ఇటీవల రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి స్వామి అనే వ్యక్తికి పట్టా చేశారని అన్నారు.

ఇదే విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని.. దీనిపై అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తహశీల్దార్ వెంకటేశ్వర్లు ఆలీంపూర్ రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement