పేర్ల గల్లంతు@రైతుబంధు

by Shyam |   ( Updated:2020-03-10 07:29:46.0  )
పేర్ల గల్లంతు@రైతుబంధు
X

దిశ, న్యూస్ బ్యూరో:
గొప్ప పథకంగా పేరుతెచ్చుకుని అటు కేంద్రం, ఇటు పలు రాష్ట్రాలకు ప్రేరణగా నిలిచిన ‘రైతుబంధు’ అమలులో కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంటున్నంత గొప్పగా ఏంలేదు. వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించిన లెక్కలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నోటితో పొగిడి నొసటితో వెక్కిరించిన తీరులో ఈ పథకం అమలవుతోంది. మెజారిటీ రైతులకు రైతుబంధు సాయం అందుతున్నా ప్రభుత్వ లక్ష్యం మేరకు మాత్రం అమలు కావడంలేదు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ప్రభుత్వం నుంచి నోటి మాట ఉత్తర్వులే వెలువడుతుండడంతో ప్రతీ సీజన్‌లో సుమారు ఐదు లక్షల మంది రైతులకు ఈ సాయం అందడం లేదు. ఇప్పటివరకు మొత్తం నాలుగు విడతల రైతుబంధు సాయాన్ని అందించగా తొలి విడత మినహా మిగిలిన మూడు విడతల్లో కలిపి (2018 రబీ నుంచి 2019 రబీ వరకు) మొత్తం 18.52 లక్షల మంది రైతుల పేర్లను తొలగించగా, వీరికి చెల్లించాల్సిన రూ. 3,829.09 కోట్లు వారికి అందకుండాపోయింది. ఉద్దేశపూర్వకంగానే అగ్రికల్చరల్ ఈఓలు కొద్దిమంది అర్హులైన రైతుల్ని రైతుబంధు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీనికి నిర్దిష్ట ప్రాతిపదిక ఏమీ లేనప్పటికీ ఏడు లేదా ఎనిమిది ఎకరాలకంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల పేర్లు మాయమవుతున్నాయి. అయితే, స్థానికంగా రాజకీయ పలుకుబడి కలిగిన ఇలాంటి ఎక్కువ భూమి కలిగిన భూస్వాముల పేర్లు మాత్రం జాబితాలో యధావిధిగా ఉంటున్నాయి. కాగా, పొమ్ము అందని రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్లి అడిగితే ఏవో కుంటిసాకులు చెప్పి దాటవేస్తున్నారని వాళ్లు మొత్తుకుంతటున్నారు.

అర్హులైన రైతుల వివరాలు:

సొమ్ము అందిన రైతుల వివరాలు:

ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి విడత (2018 ఖరీఫ్)లో మొత్తం 50.25 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి చెందిన 1.30 కోట్ల ఎకరాల సాగుభూమికి రూ. 5,236.24 కోట్లను చెల్లించింది. ఆ తర్వాతి విడత నుంచే రైతులను వడపోతపోసే ప్రక్రియ ప్రారంభమై ప్రతీ సీజన్‌కు ఐదారు లక్షల మంది పేర్లను తొలగించడం మొదలైంది. తొలి రెండు విడతల్లో రైతుబంధు సాయం కోసం బడ్జెట్ నుంచి రూ. 12,885.75 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ రెండు సీజన్‌లకు ఈ పథకం కోసం ఖర్చు చేసింది మాత్రం రూ. 10,480.49 కోట్లే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్‌లకు కలిపి రూ. 13,410.05 కోట్లను కేటాయించగా, అందులో రూ. 9,968.13 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. నిజానికి ఈ రెండు సీజన్‌లలో ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున రైతుబంధు సాయాన్ని పెంచింది. ఆ ప్రకారం ఖర్చు పెరగాల్సి ఉన్నా తగ్గిపోయింది. కారణం ఖరీఫ్ సీజన్‌లో అర్హులైన రైతుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు సాయానికి నోచుకున్నవారి సంఖ్య కూడా తగ్గడమే. సుమారు 5.58 లక్షల మంది ఖరీఫ్ సీజన్‌లో ఈ సాయాన్ని అందుకోలేదు. రబీ సీజన్‌లో ఇది మరింత పెరిగి 7.24 లక్షల మంది రైతులు దూరమయ్యారు. ఈ రెండేళ్ళకాలంలో కొత్తగా రైతులైనవారి పేర్లు పట్టాదారు పాస్ బుక్ లేదనో, ఆధార్ వివరాలు జతచేయలేదనో.. ఇలా రకరకాల పేర్లతో జాబితాలో చేరకుండా మిగిలిపోయాయి.

2018-19 ఆర్థిక సంవత్సరం రబీ సీజన్‌లో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 54.53 లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ 5.43 లక్షల మంది పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయి. చివరకు 49.10 లక్షల మందికి మాత్రమే రైతుబంధు సాయం అందింది. ఇలా జాబితా నుంచి పేర్లు గల్లంతు కావడానికి ప్రభుత్వం రకరకాల సాకులు చెప్పింది. ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, పట్టాదారు పాస్‌బుక్ నెంబర్లు మ్యాచ్ కావడంలేదని, కొత్త పాస్‌బుక్‌లు అందుబాటులోకి రానందువల్ల ఇవ్వలేకపోయామని రకరకాల వ్యాఖ్యానాలు చేసింది. ఆ ప్రకారం 5.43 లక్షల మంది అర్హులైన రైతులకు సాయమే అందలేదు. పైగా ప్రభుత్వం తుది జాబితాలో పేర్కొన్నవారిలో వివిధ రకాల కారణాలతో ఇంకా ఏడు వేల మందికి రైతుబంధు సాయాన్ని అందించనే లేదు. వారికి సంబంధించిన రూ. 4.71 కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉండిపోయాయి.
2019 ఖరీఫ్ సీజన్‌లో 52.95 లక్షల మంది రైతుల వివరాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించి వీరికి రైతుబంధు సాయం అందించాల్సిన జాబితాను అదికారులు రూపొందించారు. కానీ చివరకు లెక్కలు వేసి ట్రెజరీకి బిల్లులు సమర్పించే సమయానికి 1.97 లక్షల మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. ఆ రకంగా ప్రభుత్వానికి రూ. 924.97 కోట్లు మిగిలిపోయాయి.
2019-20 ఖరీఫ్ సీజన్‌కు రైతుబంధు సాయం ఇవ్వడం కోసం మొత్తం 56.76 లక్షల మంది రైతులు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్‌ల వివరాలను ఆధారంగా చేసుకుని జాబితా తయారైంది. కానీ ఆ సీజన్‌లో 3.61 లక్షల మంది రైతుల్ని వదిలేసి 52.95 లక్షల మంది రైతులకు మాత్రమే సాయం అందించింది. దీంతో ప్రభుత్వానికి రూ. 286.48 కోట్ల మేర రైతుబంధు డబ్బులు మిగిలిపోయాయి.

తాజా బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం రైతుబంధు కోసం రూ. 14000 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసింది. గత బడ్జెట్‌కంటే రూ. 2000 కోట్లను ఎక్కువగానే కేటాయిస్తున్నట్లు నొక్కిచెప్పింది. ఈసారి కూడా పైన చెప్పిన కారణాలతో ఎంతమంది రైతులను తొలగిస్తారో, ఎంత మొత్తం సాయం రైతులకు అందకుండా మిగిలిపోతుందో వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed