- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియంత్రణా… నిర్బంధమా?
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ర్టంలో వ్యవసాయ విధానంలో మార్పులు చేస్తున్నామంటున్న సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రకటించారు. కానీ, సరిగ్గా నాలుగేండ్ల క్రితం పత్తి సాగు వద్దే వద్దని ప్రభుత్వం హెచ్చరించింది. రైతులు సీఎం మాట నమ్మి పత్తని సాగుచేయలేదు. కానీ, ఆ ఏడు పత్తికి ఎక్కువ ధర వచ్చింది. దీంతో రైతులు లబోదిబోమన్నారు. కానీ, ప్రస్తుతం 65 లక్షల ఏకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం చెప్పింది. మరీ నాలుగేండ్ల ముందు సాగు చేయొద్దని, ప్రస్తుతం సాగు చేయాలని అనడం వెనుక మర్మమేమిటని రైతులు అంటున్నారు. ఇక సీఎం మాట ప్రకారం పత్తి సాగు చేయాలా? వద్దా? అని రైతులు గందరగోళంలో పడ్డారు. 2016 నాటి ఫలితమే పునరావృతమైతే అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు కట్ అని ప్రభుత్వం చెబుతోన్నది. ఎకరానికి రూ. 5 వేల రైతుబంధు కోసం సుమారు రూ.50 వేలు ఖర్చయ్యే పత్తి పంట వేసి దెబ్బతినడమా లేక రైతుబంధు రాకున్నా ఫర్వాలేదు గానీ కోరుకున్న పంట వేయడమా అనేది ఇప్పుడు రైతుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. సుమారు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి పొలందాకా నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోన్నది. వరి పంట పండించడానికి పుష్కలంగా నీరు ఉందనీ చెప్తోన్నది. కానీ, పత్తివైపే ఎందుకు మొగ్గుచూపుతోన్నది? వరి పంట వేస్తే అన్ని పొలాలకూ సరిపోయేంత స్థాయిలో కాళేశ్వరం నీళ్లు అందించలేమనే అనుమానమా? లేక రైతుబంధు సాయాన్ని ఎంతో కొంత తగ్గించాలనే ప్రయత్నమా? ఒకవైపు ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని చెప్తూనే వీటి వాడకం ఎక్కువగా ఉండే పత్తినే సాగు చేయాలని ఎందుకు నిర్బంధం చేస్తోన్నది? ఇవీ ఇప్పుడు సగటు రైతుల మధ్య జరుగుతున్న చర్చలు. పంట బాగా పండి ఎకరానికి ఐదారు క్వింటాళ్లు చేతికొచ్చినా మార్కెట్‌లో అమ్ముకుంటే వచ్చేది ఎక్కువలో ఎక్కువ రూ.30 వేలు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఎకరానికి రూ.50 వేలు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. అంత లాభమే వస్తే ప్రభుత్వం చెప్పకున్నా రైతులంతా పత్తినే సాగుచేసేవారు అనేది నిర్వివాదాంశం.
నష్టమొస్తే బాధ్యత ఎవరిది?
పత్తి పంటకు ఈసారి ఎక్కువ డిమాండ్ ఉంటుందని, వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహా మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకవేళ ఆ నిపుణుల అంచనాలు తారుమారై పత్తి సాగుచేసిన రైతులకు నష్టం వస్తే జవాబుదారీ ఎవరు? ప్రభుత్వం ఆదుకుంటుందా? భరోసా ఇస్తుందా? అని రైతుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజానికి పత్తి పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రెండింటిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయమూ లేదు. పంట పండించిన తర్వాత పత్తికి ఎంత ధర వస్తుందో తెలియదు. సీసీఐ ఎన్ని బేళ్ల పత్తి కొంటుందో తెలియదు. మద్దతు ధర రాకుంటే ప్రభుత్వమేమైనా సాయం చేస్తుందా అని రైతుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
2016లో పత్తి నిషేధం
2016 ఏప్రిల్ 24న అప్పటి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో సమావేశమైన తర్వాత ‘పత్తి ఎగుమతి సుంకం పెంచడంతో పాటు ఎగుమతులపై విధించే పన్ను రాయితీని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ముప్పు పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి ధరలు పడిపోతున్నాయి. దేశీయ మార్కెట్‌లోనూ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అధిక పెట్టుబడి పెట్టి సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. పత్తి మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం తెలంగాణ రైతులపై పడకుండా ఉండాలంటే రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి’ అని సీఎం వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు మాత్రం వరికన్నా పత్తిపంటను ఎక్కువగా సాగుచేయాలని కోరుతున్నారు. పరిస్థితులేవీ మారకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఆత్మహత్యల్లో పత్తి రైతులే ఎక్కువ
ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో 80 శాతం మంది పత్తి సాగుచేసేవారేనని ఒక అధ్యయనంలో తేలింది. అప్పులు తెచ్చి మరీ సాగుచేస్తే మార్కెట్‌లో ధర రాకపోతే రైతులకు ఇబ్బందులు తప్పవు. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానం తెలంగాణదే. ఇక నకిలీ విత్తనాల బాధ, వాతావరణం అనుకూలించడంలో సమస్యలు, అవసరమైనంత సంఖ్యలో కూలీలు దొరకకపోవడం, శీతాకాలంలో మంచు తేమ వచ్చి కొనుగోళ్లలో ఆంక్షలు, ఇలా అనేక సందేహాలు రైతులను గందరగోళంలోకి నెడుతున్నాయి. కంది పంటను కనీస మద్దతు ధరకు కొనడంతో పాటు తగిన ప్రోత్సాహకం కూడా ఇస్తామని చెప్తున్న కేసీఆర్ పత్తి పంట విషయంలో ఎందుకు అలాంటి హామీ ఇవ్వడం లేదనేది రైతుల్ని వేధిస్తున్న ప్రశ్న. ‘ప్రతీసారి పంటలన్నింటినీ ప్రభుత్వం కొనడం సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు గదా’ అని స్వయంగా సీఎం వ్యాఖ్యానించినందున పత్తిపంటలో నష్టం వస్తే ప్రభుత్వం ఆదుకోదనే స్పష్టతకు వచ్చారు రైతులు.
బీటీ రకం విత్తనాలు భారత్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ వీటి వాడకమే పెరిగింది. బీటీ-2 రకం విత్తనాలతో గులాబీ తెగులు, కలుపు, చీడపీడల బాధలు ఎక్కువ కావడంతో బీటీ-3 రకం పరిజ్ఞానం ఉనికిలోకి వచ్చింది. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా విత్తన కంపెనీలు, వ్యాపారులు రకరకాల పేర్లతో రైతులకు ఈ విత్తనాలను అంటకడుతున్నాయి. ఎకరానికి వర్షాధారమైతే 8 నుంచి 10 క్వింటాళ్లు, నీళ్లు కడితే 15 నుంచి 20 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా. అయితే చాలా జిల్లాల్లో వర్షాధారంతోనే పత్తి సాగవుతోన్నది. తెగుళ్లు సోకితే పెస్టిసైడ్స్ ఖర్చు మరింతగా పెరుగుతుంది. పత్తి ధర ఫస్ట్ క్వాలిటీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.4,320. కానీ మార్కెట్ డిమాండ్‌కు తగినట్లుగా ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ తక్కువకు కొంటారు. డిమాండ్ బాగా ఉంటే గరిష్టంగా రూ.5450 వస్తుంది. ఇక రెండో క్వాలిటీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 4,020. డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైవేటు వ్యాపారులు రూ. 5,200కు కొంటారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రెండో క్వాలిటీ పంటే ఎక్కువ. అంటే 10 క్వింటాళ్ల దిగుబడి సాధించినా చేతికి వచ్చేది అత్యధికంగా కేవలం రూ.52 వేలే.
విత్తనాలకే రూ. 1575 కోట్ల ఖర్చు
ప్రభుత్వం చెప్తున్నట్టుగా 65 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తే రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చవుతుందో పరిశీలిస్తే కేవలం విత్తనాలకే రూ. 1,575 కోట్లు ఖర్చవుతుంది. ఒకవేళ తొలుత చెప్పినట్టుగా 50 లక్షల ఎకరాలకే పరిమితమైతే రూ.1,050 కోట్లు అవుతుంది. ఇక ఎరువులకు 65 లక్షల ఎకరాలకు రూ. 5,600 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్రం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో ఎకరానికి సగటున రూ.2100 కేవలం విత్తనాలకే ఖర్చవుతుంది.
రైతులు సీఎం మాట వినరు: సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం నేత
గతంలో తెలంగాణ నేలలు పత్తి పంటకు అనుకూలంగా లేవని, పత్తి సాగును ప్రొత్సాహించవద్దని నాలుగేండ్ల క్రితం సీఎం చెప్పారు. ఇప్పుడు పత్తి పంటకు నేలలు అనుకూలమంటూ వ్యవసాయ అధికారుల, నిపుణుల మాటలకు అనుగుణంగా చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత విస్తీర్ణంలో పండిన పత్తిని అమ్ముకోవడానికే రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతుబంధు లేకున్నా పర్వాలేదు. వారికి ఇష్టమైన పంటనే రైతులు సాగు చేస్తారు. ప్రభుత్వం చెప్పినట్టు వింటే మళ్లీ రైతుల ఆత్మహత్యలు తప్పవు. భవిష్యత్తులో పత్తి దిగుబడి రాకపోయినా, మార్కెట్‌లో ధర రాకున్నా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందా? రైతుల్ని ఆదుకుంటుందా? ముందు వీటికి సీఎం సమాధానం చెప్పాలి.
సీఎంకు సలహాలిచ్చిన వ్యవసాయ నిపుణులెవరు?: దొంతు నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త
ఏ నేలలో, ఏ వాతవరణంలో, ఏ సమయంలో ఏ పంట వేయాలో ప్రస్తుత వ్యవసాయ శాఖలో 95 శాతం మంది అధికారులకు అవగాహన లేదు. ఈ అధికారులు గ్రామాలకు ఏడాదికొక్కసారైన వెళ్లారా? చాలామంది రైతులకు వ్యవసాయ అధికారి పేరుగానీ, వ్యవసాయ శాఖ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియదు. నియంత్రిత పంటల సాగు గురించి వ్యవసాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నట్టు సీఎం చెప్తున్నారు గానీ ఆ నిపుణులంతా అధికారులు, వివిధ రకాల కొలువుల్లో ఉన్నవారే. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనాల తయారీ ఉండాలి. సుమారు 850 రకాల హైబ్రిడ్ పత్తి విత్తనాల్లో ఏ రకం తెలంగాణ వాతావరణానికి, నేల స్వభావానికి పనికొస్తుందో తెలియదు. నాణ్యతలేని విత్తనాలతో రైతులకు వచ్చే ఇబ్బందులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందో లేదో తెలియదు.
ఎకరా పత్తి పంట ఖర్చు రూ.39,100: అంజిరెడ్డి, ఆదర్శ రైతు
ప్రస్తుత పరిస్థితులను బట్టి మార్కెట్ డిమాండ్‌కు అనుకూలంగా వ్యవసాయం చేయడమే శ్రేయస్కరం. భూమి రకం, వాతావరణం, నీటి వసతి, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల ఆధారంగా ఏ పంటలు వేస్తే బాగుంటుందో సూచించాలి. ఎకరం పొలంలో పత్తి సాగు చేసేందుకు రూ.39,100 వరకు ఖర్చవుతుందని వివరాలను పేర్కొన్నారు. అయితే ఇది ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించినదే. ఆయా ప్రాంతాలను బట్టి ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఎకరం పొలంలో పత్తి సాగుకు అయ్యే ఖర్చు వివరాలు:
కర్రలు తొలగించి చదును చేసేందుకు ముగ్గురు కూలీలకయ్యే ఖర్చు : రూ.1200
దున్నడానికి (ట్రాక్టర్‌తో) మూడు గంటల సమయం : రూ.2700
ఎరువులు (కోడి ఎరువు, రెండు ట్రాక్టర్లు) : రూ.7800
కోడి ఎరువును చల్లడానికి ఇద్దరు కూలీలు : రూ.600
నాగలితో రెండు సార్లు సాళ్లు దున్నడానికి : రూ.700
పత్తి విత్తనాలు : మూడు ప్యాకెట్లు : రూ. 2400
విత్తనాలు చల్లేందుకు ముగ్గురు కూలీలు : రూ.900
గుంటుక కొట్టదానికి (నాలుగు సార్లు) : రూ.8000
ఫెర్టిలైజర్స్ : పొటాష్, యూరియా (50 కిలోలు) : రూ.1200
యూరియా చల్లేందుకు ఖర్చు : రూ.600
పెస్టిసైడ్స్ (మోనోక్రోటాపాస్ వంటివి) : రూ.3000
పెస్టిసైడ్స్ కొట్టేందుకు కూలీ : రూ.900
కలుపు తీయడానికి ఐదుగురు కూలీలు : రూ.1500
పత్తి ఏరడానికి (మూడు సార్లు, 8 మంది కూలీల చొప్పున) : రూ.7200
పొలం నుంచి ఇంటికి, ఇంటి నుంచి మార్కెట్ వరకు రవాణా : రూ.1000
మొత్తం ఖర్చు : రూ.39,100