పంటకాలాన్ని ముందుకు తెచ్చి సాగుచేయాలి: గంగుల

by Sridhar Babu |
పంటకాలాన్ని ముందుకు తెచ్చి సాగుచేయాలి: గంగుల
X

దిశ, కరీంనగర్: వరి కోత సమయానికి వడగళ్ల వానలు పడుతుండటంతో పంటలు దెబ్బతింటున్నాయని, ఈ సమస్యను అధిగమించేందుకు పంటకాలాన్ని ముందుకు తీసుకువచ్చి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగుకే పరిమితమైన రైతులకు కొత్త పంట సాగు విధానాలపై సమగ్రంగా వివరించి ప్రోత్సహించాలన్నారు. మన పంటలు మనమే పండించుకోవాలని సీఎం సూచించారని, అయితే కొంతమంది రైతు బంధు రద్దు చేస్తున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాలోని వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, రసాయనాలు వాడేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇష్టమున్నట్లు ఎరువులు వాడితే నేల విషపూరితమై సారం కోల్పోయే ప్రమాదమున్నదని, పోటాష్, యూరియా, డీఎపీని చాలా ప్రాంతాల్లో అవసరం లేకున్నా వాడుతున్నారన్నారు. నేలల్లో లవణాలు ఉన్నప్పటికీ ఎరువులను వినియోగిస్తే భూసారం తగ్గుతుందన్న విషయాన్ని రైతాంగానికి తెలపాలన్నారు. సమైక్య రాష్ట్రంలో 25లక్షల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం కొనలేదని, కానీ ఈ సీజన్‌లో మనం 70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్న లక్ష్యంతో ఇప్పటికే 40లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కరీంనగర్‌లో వానాకాలం పంటలు, సమగ్ర వ్యవసాయ విధాన ప్రణాళికపై సమీక్షలో మంత్రి గంగుల ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.

Advertisement

Next Story