కొనుగోలు జాప్యం.. ఆగ్రహించిన అన్నదాత

by Sridhar Babu |   ( Updated:2021-06-05 10:22:51.0  )
కొనుగోలు జాప్యం.. ఆగ్రహించిన అన్నదాత
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో అన్నదాతల దుస్థితి అత్యంత దయనీయంగా మారింది. వర్షాకాల పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. మిలర్ల దోపిడీ, లారీల కొరత, తరుగు మోసం, అకాల వర్షాలు ఇలా నిత్య నరకం అనుభవిస్తున్న అన్నదాతలు ఆగ్రహానికి గురై రోడ్డెక్కిన పరిస్థితి జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని జగిత్యాల – గొల్లపెల్లి రహదారిపై రైతులు కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు.లక్ష్మీపూర్ గ్రామ ఎక్స్‌రోడ్ కమాన్ వద్ద రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో రైతుల బతుకు అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ఒక్కో సంచికి 5-6 కిలోలు కట్ చేస్తున్నారని, దీంతో రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రైతులు క్వింటల్‌కు 150 రూపాయలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యల పరిష్కారం, మిలర్ల దోపిడీ అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరతగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed