నకిలీ జామీన్ ముఠా గుట్టు రట్టు

by  |
నకిలీ జామీన్ ముఠా గుట్టు రట్టు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: నకిలీ జామీనులు తయారు చేస్తున్న ముఠాగుట్టు రట్టయింది. బెయిల్ మంజూరు కోసం నివాసం, నకిలీ ఇంటి పన్ను రసీదులు,‌ స్టాంప్స్‌ తయారు చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రామగుండం సీపీ సత్యనారాయణ శుక్రవారం గోదావరిఖని‌లో మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.

రామగిరి మండలం జల్లారం పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని సీపీ తెలిపారు. న్యాయవాదుల వద్ద పని చేసే మున్షీల సహకారంతో ఈ దందా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ముద్దాయిలకు నకిలీ ష్యూరిటీ పత్రాలు ఇచ్చారని, దాదాపు 200లకు పైగా కేసుల్లో నకిలీ ప్రతాలను సృష్టించారని సీపీ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో న్యాయవాదుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

ఈ కేసులో రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయిని కొమురయ్య (53), మల్లిపల్లి కిషన్ (35), ఎండి తాజ్, పులిపాక శేఖర్ (30), జూల శ్రీనివాస్ (34), బత్తిని శివకుమార్ (30), జూల అదినారాయణ (31), అడ్వకేట్ మున్షిగా పనిచేస్తున్న గోదావరిఖనిలోని విఠల్ నగర్‌కు చెందిన నిమ్మతి మహేందర్ (43)లను అరెస్ట్ చేశామని వివరించారు. వీరి నుంచి మూడు నకిలీ ష్యూరిటీ పత్రాలు, నకిలీ ఇంటి పన్ను పత్రాలు, ఇంటి పన్ను నకిలీ బిల్లు బుక్స్, జల్లారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పేరుతో ఉన్న రెండు రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. నకిలీ ష్యూరిటీల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేసేవారని చెప్పారు. గత 15 ఏళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని సీపీ వెల్లడించారు.


Next Story

Most Viewed