ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు..

by Shyam |
Euro
X

దిశ, స్పోర్ట్స్: యూరో 2020 ఫైనల్‌లో ఇటలీ-ఇంగ్లాండ్ తలపడిన సంగతి తెలిసిందే. నిర్ణీత సమయంలో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూటవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఇంగ్లాండ్ తరపున పెనాల్టీ కిక్స్ తీసుకున్న మార్కస్ రాష్‌ఫోర్డ్, జాడన్ సాంచో, బుకాయో సాకా గోల్స్‌గా మరల్చలేకపోవడంతో ఓటమి తప్పలేదు. అయితే ఈ ముగ్గురు నల్లజాతీయులు కావడంతో ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లపై సోషల్ మీడియాలో విపరీతంగా జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ మేనేజర్ గెరెత్ సౌత్‌గేట్ కావాలనే వీరి ముగ్గురిని చివరి నిమిషంలో ఈ ముగ్గురిని బరిలోకి దింపి ఓటమికి కారకులుగా చూపెడుతున్నాడని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎఫ్ఏ) సోమవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది.

‘ఎఫ్ఏ ఈ జాతి వివక్షను పూర్తిగా ఖండిస్తున్నది. ఇంగ్లాండ్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న జాత్యహంకార పూరిత ఆరోపణలను ఎఫ్ఏ ఖండిస్తున్నాము’ అని ఎఫ్ఏ ప్రకటనలో పేర్కొన్నది. ఇలాంటి వివక్షా పూర్వక ప్రకటనల వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఏ చెప్పింది. మరోవైపు ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కూడా జాతి వివక్షపై మండిపడ్డారు. ఆటను ఆటలాగ చూడాలి తప్ప అందులో జరిగిన పొరపాట్లను ఒక వర్గంపై రుద్దరాదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story