మే నెలలో భారత ఎగుమతులు 67 శాతం వృద్ధి

by Harish |   ( Updated:2021-06-02 05:12:57.0  )
మే నెలలో భారత ఎగుమతులు 67 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు మే నెలలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు వంటి రంగాల్లో మెరుగైన వృద్ధి నేపథ్యంలో మేలో ఎగుమతులు 67.39 శాతం పెరిగి 32.21 బిలియన్ డాలర్లు(రూ. 2.35 లక్షల కోట్లు)కు చేరుకున్నాయని బుధవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది మేలో ఎగుమతులు 19.24 బిలియన్ డాలర్లు(రూ. 1.40 లక్షల కోట్లు) నమోదవగా, 2019 మేలో ఇది 29.85 బిలియన్ డాలర్లు(రూ. 2.18 లక్షల కోట్లు)గా ఉన్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దిగుమతులు సైతం గతేడాది మేలో నమోదైన 22.86 బిలియన్ డాలర్ల(రూ. 1.67 లక్షల కోట్లు)తో పోలిస్తే ఈ ఏడాది మేలో 68.54 శాతం పెరిగి రూ. 38.53 బిలియన్ డాలర్ల(రూ. 2.81 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి.

2019, మేలో దిగుమతులు 46.68 బిలియన్ డాలర్లు(రూ. 3.41 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ‘ఈ ఏడాది మేలో భారత ఎగుమతుల వృద్ధి మెరుగ్గా ఉన్నప్పటికీ దిగుమతులు అధికంగా ఉండటంతో వాణిజ్య లోటు 6.32 బిలియన్ డాలర్లు(రూ. 46 వేల కోట్లు)గా ఉంది. ఇది గతేడాది మే నెలతో పోలిస్తే 74.69 శాతం ఎక్కువ. 2020లో వాణిజ్య లోటు 3.62 బిలియన్ డాలర్లు(రూ. 26 వేల కోట్లు)గా ఉంది. అయితే 2019, మేలో నమోదైన 16.84 బిలియన్ డాలర్లు(రూ. 1.23 లక్షల కోట్ల) కంటే 62.49 శాతం క్షీణించినట్టు’ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

తగ్గిన చమురు దిగుమతులు..

సమీక్షించిన నెలలో చమురు దిగుమతులు గతేడాది మేలో 3.57 బిలియన్ డాలర్ల(రూ. 26 వేల కోట్ల) నుంచి ఈ ఏడాదిలో 9.45 బిలియన్ డాలర్ల(రూ. 69 వేల కోట్ల)కు పెరిగాయి. 2019, మేలో ఇది 12.59 బిలియన్ డాలర్లు(రూ. 91 వేల కోట్లు)గా ఉంది. సమీక్షించిన నెలలో పెట్రోలియం యేతర ఎగుమతులు 54.06 శాతం పెరగ్గా, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 45.96 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. చమురు దిగుమతులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మేలో 24.94 శాతం క్షీణించాయి.

Advertisement

Next Story