- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటు కరోనా కాటు.. ఇటు కార్పొరేట్ పోటు..ఆపేదెవరు..?
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ సామాన్యులకు చుక్కలు చూపెడుతుంటే కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. పేషెంట్ల ఆపదను, ఆందోళనను ఆసరా చేసుకుని లక్షలాది రూపాయలను దండుకుంటున్నాయి. బిల్లు చెల్లించకుంటే డెడ్ బాడీని కూడా ఇవ్వమంటూ ఆస్పత్రుల యాజమాన్యాలు దౌర్జనం చేస్తున్నాయి. గతేడాది కరోనా సమయంలో ఇదే జరిగింది. కొన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. తూతూ మంత్రంగా మొక్కుబడి విచారణ జరిపి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇప్పుడు మళ్లీ అదే తంతు కొనసాగుతున్నా.. వైద్యారోగ్య శాఖ కళ్ళు మూసుకుని ఏమీ తెలియనట్లుగా నటిస్తోంది. చివరకు మంత్రి ఈటల రాజేందర్ సైతం నిస్సహాయతే వ్యక్తం చేశారు.
కరోనా పేషెంట్లకు చేసే ట్రీట్‌మెంటుకు వసూలు చేసే ఛార్జీల పట్టికను రాష్ట్ర ప్రభుత్వం జీవో (నెం. 248) రూపంలో గతేడాది జూన్‌లో జారీ చేసింది. ఆ జీవోను తుంగలో తొక్కి తమకు నచ్చిన రేట్లు వేసుకుంటూ ప్రజలు ప్రాణాలతో కార్పొరేట్ ఆసుపత్రులు చెలగాటమాడుతున్నాయి. నాలుగున్నర లక్షల రూపాయల బిల్లు కట్టనందుకు నాలుగు రోజుల క్రితం ఆల్వాల్‌కు చెందిన రామారావు అనే పేషెంటును స్టోర్ రూమ్‌లో బంధించింది బేగంపేటలోని విన్ హాస్పిటల్ యాజమాన్యం. మరికొద్దిమంది పేషెంట్లు లక్షలాది రూపాయల బిల్లులు కట్టలేమంటూ మంత్రి కేటీఆర్‌కు మొరపెట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవితను కూడా ట్వీట్ ద్వారానే వేడుకుంటున్నారు. కానీ వైద్యారోగ్య శాఖ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
హెచ్చరికలకు బదులుగా వేడుకోలు
కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం ప్రభుత్వ జీవోను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా ఛార్జీలను వసూలు చేస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘శవాలపై పేలాలు ఏరుకుంటున్నాయి‘ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది జీవో ప్రకారం సాధారణ వార్డుల్లో రోజుకు రూ. 4,000, ఐసీయూ వార్డులో రూ. 7,500, వెంటిలేటర్ పెడితే రూ. 9,000 చొప్పున మాత్రమే వసూలు చేయాలని, అందులో కొన్ని వైద్య పరీక్షలు కూడా కలిసే ఉంటున్నందున వాటికి అదనంగా డబ్బులు వసూలు చేయవద్దని ప్రభుత్వం పేర్కొంది.
టెస్టుల నుంచి ట్రీట్‌మెంట్ దాకా ఉల్లంఘనలు
ప్రజారోగ్య శాఖ నిబంధనల ప్రకారం కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టు చేసినా, పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ట్రీట్‌మెంట్ ఇస్తున్నా విధిగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వెబ్ పోర్టల్‌లో పేర్లను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంది. కానీ పెడచెవిన పెట్టిన యాజమాన్యాలు వివరాలను ప్రభుత్వానికి పంపడంలేదు. ప్రజారోగ్య శాఖ సైతం కొన్నిసార్లు హెచ్చరించి వదిలేసింది తప్ప నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించేలా నియంత్రించలేకపోయింది. టెస్టులు చేయించుకున్నవారిలో పాజిటివ్ నిర్ధారణ అయినట్లయితే వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల్లో వ్యక్తుల్ని ట్రేస్ చేసి పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనలు పెట్టినా పాటించడంలో ఆస్పత్రులు విఫలమయ్యాయి. ప్రజారోగ్య సైతం చేతలెత్తేసింది.
ఇక ట్రీట్‌మెంట్ విషయంలో సైతం ఇష్టారీతిలో ఛార్జీలను వసూలు చేస్తున్న విషయం మంత్రులు, అధికారుల దృష్టికి వెళ్తున్నా పాటించుకునే నాథుడే కరువయ్యాడు. సెకండ్ వేవ్‌లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించడం కోసం ఇటీవల యాజమాన్యంతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ ‘మానవత్వంతో వ్యవహరించాలి‘ అంటూ సూచనలు చేశారే తప్ప కఠినంగా వ్యవహరించలేకపోయారు.
ప్రైవేటు బోధనాస్పత్రుల్లో యాభై శాతం సీట్లను కరోనా కోసం కేటాయించాలని, వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఈసారి మాత్రం దాన్ని గాలికొదిలేసింది. అదనపు బెడ్‌లను సమకూర్చుకోవాలంటూ ఆదేశించిన ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోలేదు. ఎంత మంది పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారో వివరాలు కూడా ప్రభుత్వానికి సకాలంలో అందడంలేదు. ప్రజారోగ్య, వైద్య విద్య విభాగాల అధికారులు సైతం నిస్సహాయులుగానే మిగిలిపోయారు.