పసందైన పప్పు ఉసిరి పచ్చడి

ఉసిరి కాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటిలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కన్న ఎక్కువ విటమిన్ సీ మనకు ఉసిరికాయల్లోనే దొరుకుతుంది. బ్రహ్మాండమైన రోగనిరోధక శక్తి, ఎల్లప్పుడూ ఉత్సాహం, సకల రోగాల పాలిటి శత్రువుగా ఉసిరి పని చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. చర్మరక్షణ, కేశ సంరక్షణ, రోగనిరోధక వ్యవస్థలకు ఆమ్లా ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ ఉసిరి జ్యూస్, లేదా పచ్చివి తినడం కొందరికి ఇష్టంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పుల్లగా ఉండటం, లేదా రుచిగా అనిపించకపోవడం కారణం కావొచ్చు. కాబట్టి మనకు నచ్చేట్టుగా చేసుకుని తీసుకోవడం ఎలాగో చూద్దాం.. పప్పు ఉసిరిని పచ్చడిగా పెట్టుకోవడం ద్వారా అందరు ఎంతో ఇష్టంగా ఉసిరి కాయ తినొచ్చు. ఆ పప్పు ఉసిరి పచ్చడి తయారు చేయడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

ఉసిరికాయలు – 1 కిలో
మంచినూనె – పావుకిలో
జీలకర్ర – తగినంత
ఎండిన మిర్చి -5
వెల్లుల్లి పేస్ట్ – తగినంత
ఉప్పు – అర్ధ పావు
కారం – పావు కిలో

తయారు చేసే విధానం:

*ముందుగా ఉసిరి కాయలు శుభ్రం చేసి ఆరపోయాలి.
*స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి, ఉసిరికాయలను దోరగా వేయించాలి.
*వేయించిన ఉసిరికాయలను వేరే పాత్రలో తీసుకోవాలి.
*మొదట ఉసిరికాయలను వేయించిన కడాయిలో ఎండిన మిర్చి, జీలకర్ర, శనిగలు, వెల్లుల్లి పేస్టు దోరగా వేయించాలి.
*కడాయిలోనే ఉప్పు, కారం పొడి వేయాలి. ఆ తర్వాత వేయించిన ఉసిరికాయలు ఇందులో కలుపుకోవాలి.
*అవసరమైతే రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. అంతే ఇక నోరూరించే పప్పు ఉసిరి పచ్చడి రెడీ.

Tags: amla, pickle, very good for health, vitamin c

Advertisement