పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గినా, ఆదాయం పెరిగాయి!

by Harish |
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గినా, ఆదాయం పెరిగాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది నుంచి కరోనా ప్రభావంతో అన్ని రకాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం డీలాపడినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధనాల నుంచి మాత్రం ఆదాయం భారీగా పెరిగింది. ఎందుకంటే, పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా గతేడాది అమ్మకాలు భారీగా క్షీణించినప్పటికీ వీటిపై పన్నుల వసూళ్లు మాత్రం పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎక్సైజ్ సుంకం నుంచి మాత్రమే కేంద్రానికి రూ. 1.96 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయంలో ఎక్సైజ్ సుంకం నుంచి వచ్చే ఆదాయం రూ. 1.32 లక్షల కోట్లుగా నమోదైనట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సీజీఏ) డేటా తెలిపింది. అంతేకాకుండా దేశీయంగా ఎక్కువ వినియోగంలో ఉన్నటువంటి డీజిల్ వాడకం దాదాపు కోటి టన్నులు తగ్గినప్పటికీ ఆదాయం పెరగడం గమనార్హం. 2019లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మొత్తం 5.5 కోట్ల టన్నుల డీజిల్ అమ్మకాలు జరిగాయి. 2020 ఇదే సమయంలో 4.4 కోట్ల టన్నుల డీజిల్ అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. పెట్రోల్ కూడా అంతకుముందు ఏడాదిలో మొత్తం 2.04 కోట్ల టన్నులు విక్రయాలు జరగ్గా, 2020లో 1.7 కోట్ల టన్నులు మాత్రమే అమ్ముడయ్యాయని చమురు మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story