కరోనా కోసం ప్రత్యేక వెంటిలేటర్.. ఐకో-వెంట్‌ రూపకల్పన

by Shyam |   ( Updated:2020-04-21 11:54:10.0  )
కరోనా కోసం ప్రత్యేక వెంటిలేటర్.. ఐకో-వెంట్‌ రూపకల్పన
X

దిశ, రంగారెడ్డి: ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వ్యాధికి ఇప్పటివరకు మందు లేదు. బాధితులను కాపాడాలంటే వెంటిలేటర్లు చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎంపీ, ఇంజినీర్ కొండా విశ్వేశ్వరరెడ్డి నూతన ఆవిష్కరణ చేశారు. ప్రెసెషన్ ఎయిర్ పంప్(పీఏపీ) అనే పరికరం రూపొందించారు. ఈ పరికరం వెంటిలేటర్లకు అమర్చడం ద్వారా కరోనా బాధితుల ఊపరితిత్తులకు హాని జరగకుండా ఉంటుందని ఆయన తెలిపారు. దీనికి ఐకో-వెంట్(ఇండియన్ కొవిడ్-19 వెంటిలేటర్)గా నామకరణం చేశారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తమ నివాసంలో ఐకో-వెంట్‌ను ఆవిష్కరించిన విశ్వేశ్వర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తాము రూపొందించిన పరికరం పనితీరు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రపంచంలో ఎన్నో రకాల వెంటిలేటర్లు ఉన్నాయని అన్నీ కరోనా బాధితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడవు. సంప్రదాయ వెంటిలేటర్లలో ఉండే ఏఎంబీయూ బ్యాగులతో బాధితుల ఊపిరితిత్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండటం కోసం ప్రెసెషన్ ఎయిర్ పంపును రూపొందించాం. దీనిద్వారా కరోనా బాధితుల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ఉంటాయి. పీఏపీని స్థానికంగా లభించే పరికరాలతో తయారు చేశాం. దీనికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల వరకు ఖర్చవుతుంది. వీటి ఉత్పత్తి ప్రారంభించడానికి మూడు వారాల సమయం పడుతుంది.నెలకు 200 నుంచి 300 వరకు మాత్రమే పీఏపీలను ఉత్పత్తి చేయగలం. ఆరు వారాలపాటు అవిశ్రాంతంగా శ్రమించి, దేశీయ సాంకేతికను ఉపయోగించి ఐకో-వెంట్‌ను రూపొందించాం. యూకే, కెనడా తదితర దేశాలు కరోనా చికిత్సకు ఉపయోగపడటం కోసం అతి తక్కువ సమయంలో వెంటిలేటర్ల రూపకల్పనకు పాటించాల్సిన కొన్ని ప్రమాణాలను రూపొందించాయి. మన దేశంలో కూడా ఇలాంటి ప్రమాణాలను రూపొందించాలి. పేటెంట్‌ కోసం కూడా దరఖాస్తు చేశామని విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Tags: Rangareddy, Ex Mp konda vishweshwar reddy, Eco vent invent


Advertisement
Next Story

Most Viewed